హైదరాబాద్, వెలుగు: స్పోర్ట్స్ కోటాలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నియామకానికి సంబంధించి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో నియామకంపై సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని పేర్కొంటూ అభ్యర్థి బి.స్వర్ణ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.శరత్ విచారణ జరిపి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు. ఇదే పిటిషన్‌లో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితారాణితోపాటు మరో ఇద్దరు అధికారులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించారు.
