విద్యార్థుల వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

విద్యార్థుల వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
  •     ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ ఫైర్
  •     కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యలు, పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌లపై ప్రశ్నిస్తే విద్యార్థులపై లాఠీచార్జ్ చేయిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. విద్యార్థుల వ్యవహారంలో ఆ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కేవలం ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించాల్సిన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేసాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తొలి రోజు నుంచే బిల్లులు, నీట్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై గందరగోళం సృష్టించి సభ జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు. సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని విస్మరించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో దాదాపు రూ. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో విద్యార్థులకు ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.