- పైలట్ ప్రాజెక్ట్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 గ్రామాల్లో పనులు
- ఇప్పటికే ములుగు జిల్లాలోని మూడు ఊళ్లలో 100 శాతం పూర్తి
- భూపాలపల్లి జిల్లా కాటారంలో 85 శాతం కంప్లీట్
- వెనుకబడిన హనుమకొండ, వరంగల్ జిల్లాలు
- ఆగస్టు చివరి నాటికి పనులు పూర్తి చేసేలా టార్గెట్
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది గ్రామాలు మోడల్ సోలార్ విలేజ్‌లుగా రూపుదిద్దుకుంటున్నాయి. గ్రీన్ ఎనర్జీని అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం తొలి దశలో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది ఊళ్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పనులు చేపట్టింది. ఇప్పటికే కొన్నిచోట్ల సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాలేషన్ పనులు వంద శాతం పూర్తయ్యాయి. దీంతో తొందర్లోనే ఆయా ఊళ్లలో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి.
ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడు గ్రామాల్లో పనులు పూర్తికాగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో టీజీ రెడ్కో అధికారులు ఈ రెండు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆగస్టు నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది
గ్రీన్ ఎనర్జీ డెవలప్‌మెంట్‌లో భాగంగా విద్యుత్ వినియోగదారుల ఇండ్లపై సోలార్ పంట పండించడంతో పాటు ప్రతి ఇంటిని పవర్ జనరేటింగ్ యూనిట్‌గా డెవలప్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను అమలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీ రెడ్కో), డిస్కంల ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారుల ఇండ్లు, రైతుల అగ్రికల్చర్ పంప్ సెట్లపై సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
తెలంగాణలోని 81 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పనులు చేపట్టగా.. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది గ్రామాలు ఎంపికయ్యాయి. అందులో హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు మండల కేంద్రం, ఎల్కతుర్తి మండలం కేశవాపూర్, వరంగల్ జిల్లా పోతిరెడ్డిపల్లి, కిష్టాపూర్; జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం; ములుగు జిల్లా అన్నంపల్లి, చిన్నగుంటూరుపల్లి, జగ్గన్నపేట, పులిగుండం గ్రామాలున్నాయి. కాగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాల్లో అవకాశం ఉన్న ప్రతి ఇంటిపై దాదాపు రూ.1.38 లక్షలతో 2 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం రూ.78 వేలు చెల్లిస్తుండగా, మిగతా రూ.60 వేలు కేంద్రం భరిస్తోంది.
ములుగు పైలట్ గ్రామాల్లో పూర్తి
మోడల్ సోలార్ విలేజ్ పైలట్ ప్రాజెక్టు పనుల్లో ములుగు జిల్లా టాప్‌లో నిలిచింది. ములుగు జిల్లాలోని నాలుగు గ్రామాల్లో పనులు చేపట్టగా.. అందులో మంత్రి సీతక్క సొంతూరు జగ్గన్నపేట, అన్నంపల్లి, చిన్నగుంటూరుపల్లిలో వంద శాతం పనులు పూర్తయ్యాయి. ఈ మూడు గ్రామాల్లో 296 విద్యుత్ సర్వీసులు ఉండగా.. అందులో గృహ జ్యోతి సర్వీసులు 207 ఉన్నాయి.
వీటిలో 89 ఇండ్లు సోలార్ రూఫ్ టాప్ ఇన్‌స్టాలేషన్‌కు అనుకూలంగా ఉండటంతో అధికారులు వంద శాతం పనులు పూర్తి చేశారు. ఇందులో 77 ఇండ్ల సింక్రోనైజేషన్ కూడా కంప్లీట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కూడా మోడల్ సోలార్ విలేజ్ పనులు చివరి దశకు చేరాయి.
ఇక్కడ మొత్తంగా 700 విద్యుత్ సర్వీసులు ఉండగా.. అందులో 334 గృహజ్యోతి కనెక్షన్లున్నాయి. వాటిలో 113 ఇండ్లపై రూఫ్ టాప్ ఇన్‌స్టాలేషన్‌కు అవకాశం ఉండటంతో ఇప్పటికే 99 ఇండ్లపై పూర్తి చేశారు. ఇంకో 14 పెండింగ్‌లో ఉండగా... తొందర్లోనే ఆ పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
రెండు జిల్లాల్లో స్లో
అత్యధిక సర్వీసులున్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మాత్రం పనులు స్లోగా నడుస్తున్నాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో 1,821 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. అందులో 1,171 గృహజ్యోతి సర్వీసులున్నాయి. వాటిలో 761 ఇండ్లపై రూఫ్ టాప్స్‌కు అవకాశం ఉండగా.. ఇప్పటివరకు 251 మాత్రమే పూర్తయ్యాయి. కేశవాపూర్‌లోని 310 ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాల్సినప్పటికీ కేవలం 65 మాత్రమే పూర్తయ్యాయి.
దీంతో హనుమకొండ జిల్లాలో దాదాపు 30 శాతమే పూర్తయినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో 47 ఇండ్లు, కిష్టాపూర్ లో 47 ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఇన్‌స్టాలేషన్ పూర్తి కాలేదు. దీంతో టీజీ రెడ్కో ఆఫీసర్లు ఈ రెండు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పెండింగ్ పనులు పూర్తి చేయించేందుకు ఆగస్టు 31 వరకు టార్గెట్ పెట్టారు. నిర్దిష్ట గడువులోగా పనులన్నీ పూర్తి చేసి పైలట్ ప్రాజెక్టు గ్రామాలను మోడల్ సోలార్ విలేజ్‌గా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనుకున్న సమయంలోగా వర్క్స్ అన్నీ పూర్తయితే మంత్రుల చేతులమీదుగా మోడల్ సోలార్ విలేజ్‌లను ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు.
31 లోగా పూర్తి చేసేలా చర్యలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ఇన్‌స్టాలేషన్ స్పీడప్ చేస్తున్నాం. ఇప్పటికే ములుగు జిల్లాలో దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. మిగతా చోట్లా కూడా పనులు వేగంగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లతో మాట్లాడుతున్నాం. ఆగస్టు 31లోగా పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో వంద శాతం పనులయ్యేలా చర్యలు చేపడతాం.
-గంధం రాజేందర్, టీజీ రెడ్కో డీఎం, వరంగల్
