నర్సంపేట, వెలుగు : రైతులు, భూ యజమానులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ-సర్వేను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద సూచించారు. నర్సంపేట డివిజన్‌లోని ఖానాపూర్ మండలం రంగంపేట, నర్సంపేట మండలం రామవరం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సుమారు 100 ఏండ్ల తర్వాత చేపడుతున్న రీ-సర్వేలో భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నట్లు తెలిపారు.
భూ వివరాల్లో తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభల్లో అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీరు, పశువుల నీటి లభ్యతపై దృష్టి సారించాలని, నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఉమారాణి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్లు, ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
