ఫుడ్ ప్యాకెట్లపై లేబుల్స్ వేస్తారా.. మమల్ని వేయమంటారా..? కేంద్రానికి సుప్రీం కోర్టు వార్నింగ్

ఫుడ్ ప్యాకెట్లపై లేబుల్స్ వేస్తారా.. మమల్ని వేయమంటారా..? కేంద్రానికి సుప్రీం కోర్టు వార్నింగ్

న్యూఢిల్లీ: హెవీ షుగర్, సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ ముద్రించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. “మీరు చేయకపోతే.. మేమే ఆదేశాలు జారీ చేస్తాం” అని హెచ్చరించింది. జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌‌‌‌‌‌‌‌తో కూడిన ధర్మాసనం గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపింది. 

ఆహార పరిశ్రమ హెచ్చరిక లేబుల్స్‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకిస్తోందన్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ఏఐ) వాదనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కార్పొరేట్ సంస్థల ఒత్తిడికి తలొగ్గొద్దని కేంద్రానికి సూచించింది. ప్యాకెట్లపై హెచ్చరిక గుర్తులకు బదులుగా అదనపు షుగర్, సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ శాతాన్ని పట్టిక రూపంలో చూపించాలని ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్ఏఐ సూచించింది. 

 ‘మీరే చేస్తారా.. మేమే ఆదేశించాలా?’

కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ బ్రిజేందర్ చహర్‌‌‌‌‌‌‌‌ను ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని గుర్తుచేసింది. పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ ఒత్తిడికి ప్రభుత్వం లొంగుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. “ప్రభుత్వమే ఈ పని చేస్తుందా? లేక మేమే ఆదేశాలు ఇవ్వాలా?” అని ప్రశ్నించింది.

ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎఫ్​ఎస్ఎస్​ఏఐ హెచ్చరిక

ఆహార ఉత్పత్తుల ప్రచారంలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు నిబంధనలు పాటించాలని  ఎఫ్​ఎస్ఎస్​ఏఐ స్పష్టం చేసింది. శాస్త్రీయ ఆధారాలు లేని ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. బ్రాండ్ల తరపున ప్రచారం చేసే ముందు వాటి నాణ్యత, నిరూపితమైన ఆధారాలను క్రియేటర్లు నిర్ధారించుకోవాలని సూచించింది. కొన్ని ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, నాణ్యతా ప్రమాణాలు పాటించని శ్రీస్యామ్ ఫుడ్స్, భారత్ ఫుడ్ ప్రొడక్ట్స్, కేడీపీ ఫుడ్ ఇండస్ట్రీ సంస్థల నెయ్యి, ఆవాల నూనె ఉత్పత్తుల తయారీ, విక్రయాలను ఎఫ్​ఎస్ఎస్​ఏఐ నిషేధించింది.