- విద్యుత్ సౌధ ముందు ఆందోళన చేపట్టాలని పవర్ జేఏసీ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 19న మహాధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా ప్రకటించారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కోతో పాటు సదరన్, నార్తర్న్ డిస్కమ్‌ల ఉద్యోగులు, ఆర్టిజన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో పవర్ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం జరిగింది.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ గత 40 రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నప్పటికీ, యాజమాన్యం స్పందించకపోవడంపై నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య వైఖరికి నిరసనగా ఈ మహాధర్నాకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మీటింగ్ అనంతరం విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లకు సంబంధించిన 14 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌కు జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, వైస్ చైర్మన్ మహేశ్, నాయకులు వజీర్, తాజుద్దీన్ బాబా, కరుణాకర్ రెడ్డి, సదానందం, జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
