పార్లమెంట్‌లో తొలిసారి ‘వందే మాతరం’.. ఆరు చరణాల తర్వాత ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్‌లో తొలిసారి ‘వందే మాతరం’.. ఆరు చరణాల తర్వాత ఉభయ సభలు వాయిదా

 

  • ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్, ఇతర సభ్యుల హాజరు 
  • ముగిసిన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ వర్షాకాల సమావేశాలు
  • మొత్తం 12 బిల్లులు ఆమోదం.. చర్చలేకుండనే 10 బిల్లులు పాస్   

న్యూఢిల్లీ: పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ చరిత్రలోనే తొలిసారిగా ఉభయసభల్లో  జాతీయ గేయం ‘వందేమాతరం’ వినిపించింది. జాతీయ గేయాలాపన తర్వాత ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు. ఉదయం సభ ప్రారంభమైన మూడు నిమిషాల పది సెకన్ల సమయం.. ఈ వర్షాకాల సమావేశాల మొత్తంలోనే అత్యంత ప్రశాంతమైన క్షణాలుగా నిలిచాయి!   సభ ప్రారంభం కాగానే జాతీయ గేయం ఆలపించారు. ప్రధాని సహా  సభ్యులందరూ   లేచి నిలబడ్డారు. గీతం పూర్తి కాగానే.. సభను నిరవధికంగా  వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సమావేశాల చివర్లో సభ పనితీరు, ప్రొడక్టివిటీపై స్పీకర్ సాంప్రదాయ ముగింపు ప్రసంగం కూడా లేకపోవడం గమనార్హం.  అటు రాజ్య సభనూ చైర్మన్​ నిరవధికంగా వాయిదా వేయడంతో పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి.

అమిత్ షా రాకతో రచ్చ..  

ఉదయం 11 గంటలకు సభ ప్రారంభానికి ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌‌‌‌‌‌‌‌సభలోకి అడుగుపెట్టారు. ఆయనను చూడగానే ప్రతిపక్ష ఎంపీలు ఒక్కసారిగా సీట్ల నుంచి లేచి బిగ్గరగా అరిచారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జి, కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అమిత్ షా క్షమాపణ చెప్పాలి’’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీనికి ప్రతిగా అధికార ఎన్డీయే ఎంపీలు కూడా గట్టిగా కేకలు వేస్తూ ఎదురుదాడికి దిగారు. దాంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమిత్ షా వైపు చూస్తూ ప్రతిపక్షాలు నినాదాలు చేస్తుంటే, ఆయన చిరునవ్వు చిందిస్తూ తన పార్టీ ఎంపీలను కూర్చోవాలంటూ సైగలు చేశారు. కాసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ సభలోకి రావడం, జాతీయ గేయం ప్లే అవ్వడం, స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేయడం వరుసగా జరిగిపోయాయి.

చర్చలే లేకుండా బిల్లులకు ఆమోదం..

సభలో ఏ కాస్త సమయం దొరికినా బిల్లులను వేగంగా ఆమోదింపజేసుకోవడానికే కేంద్రం ప్రాధాన్యమిచ్చింది. మొత్తం 12 బిల్లులను ఆమోదించడం.. తిరిగి పంపడం చేసింది. ‘‘పేపర్ లీకేజీ నిరోధక బిల్లు’పై మాత్రమే దాదాపు 11 గంటల పాటు సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. మిగిలిన 10 కీలక బిల్లులను మాత్రం ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల నడుమ ఎలాంటి చర్చ లేకుండా కేవలం కొన్ని నిమిషాల్లోనే  వాయిస్ ఓట్ ద్వారా ఆమోదింపజేశారు. ఇక విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ)ను బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు.

బిజినెస్ పరంగా సభ విజయవంతం: రిజిజు 

ఈ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ‘‘బిజినెస్‌‌‌‌‌‌‌‌పరంగా ఇది చాలా విజయవంతమైన సెషన్.. మేం మొత్తం 12 బిల్లులను ఆమోదించాం. అయితే చర్చలు, సంభాషణల కోణం నుంచి చూస్తే ఇది అంతగా విజయవంతం కాలేదు. లోక్‌‌‌‌‌‌‌‌సభలో కేటాయించిన మొత్తం సమయంలో కేవలం 19% మాత్రమే ఉత్పత్తి సాధించగా, రాజ్యసభలో అది 39%గా నమోదైంది” అని ఆయన వివరించారు.

రాజ్యసభ నిరవధిక వాయిదా..

రాజ్యసభలో చివరి రోజు ‘మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ రెగ్యులేషన్) అమెండ్‌‌‌‌‌‌‌‌మెంట్ బిల్లు, 2026’ పై చర్చ జరిగింది. ఈ బిల్లును సభ ఆమోదించింది. ఈ వర్షాకాల సమావేశాల్లో  రాజ్యసభ మొత్తం 37 గంటల 49 నిమిషాల పాటు పనిచేసిందని చైర్మన్‌‌‌‌‌‌‌‌ సీపీ రాధాకృష్ణన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఈ సెషన్‌‌‌‌‌‌‌‌లో 12 బిల్లుల ఆమోదం/తిరిగి పంపడం పూర్తయిందని చెప్పారు.  ‘‘సభ వేదిక తెరిచే ఉంది.. కానీ మనం ప్రాతినిధ్యం వహించే ప్రజల ఆందోళనలను లేవనెత్తడానికి ఈ అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోలేకపోయాం. వరుస ఆటంకాలు ప్రజల్లో మనపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి, కాబట్టి మనం పార్లమెంటరీ క్రమశిక్షణను కాపాడుకోవాలి” అని పేర్కొన్నారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తూ ప్రకటన చేశారు.

లోక్‌సభలో చర్చ లేకుండా నిమిషాల్లోనే పాస్ అయిన బిల్లులు ఇవే..
 
బిల్లు    సమయం (నిమిషాల్లో)
జాతీయ గౌరవ నిరోధక (సవరణ) బిల్లు–2026    14  
ట్రిబ్యూనల్స్‌‌‌‌‌‌‌‌ సంస్కరణల బిల్లు– 2026    12  
నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ బిల్లు–2026    10  
మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్) బిల్లు–2026    5  
బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు–2026    5  
సుప్రీంకోర్టు (జడ్జిల సంఖ్య) సవరణ బిల్లు–2026    4  
జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు–2026    4  
కేరళ (పేరు మార్పు) బిల్లు–2026    4  
ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ అభివృద్ధి బిల్లు–2026    3  
ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (సవరణ) బిల్లు–2026    3