సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి.. నాందేడ్ గురుద్వారాలో కలకలం

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి.. నాందేడ్ గురుద్వారాలో కలకలం

నాందేడ్: శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) చీఫ్, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్‌‌‌‌‌‌‌‌ బాదల్‌‌‌‌‌‌‌‌పై గురువారం మధ్యాహ్నం మహారాష్ట్రలో దాడి జరిగింది. నాందేడ్ సమీపంలోని ముగా గ్రామంలో ఉన్న ప్రసిద్ధ మాతా సాహిబ్ గురుద్వారాలో దర్శనం ముగించుకుని బయటకు వస్తుండగా, జస్పాల్ సింగ్ అనే నిహాంగ్ సిఖ్ కత్తితో ఆయనపై దాడికి తెగబడ్డాడు. సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్ బాదల్‌‌‌‌‌‌‌‌ తన భార్య, ఎంపీ హర్‌‌‌‌‌‌‌‌సిమ్రత్ కౌర్ బాదల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రార్థనలు పూర్తి చేసుకుని మెట్లు దిగుతుండగా, నిందితుడు ఒక్కసారిగా సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్ పొట్ట భాగంలో పొడవడానికి ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయనకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దాడిలో సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్ సింగ్ బాదల్ చేతికి గాయమైంది. ఆయనను రక్షించే క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా గాయపడ్డారు. వెంటనే బాదల్‌‌‌‌‌‌‌‌ను నాందేడ్‌‌‌‌‌‌‌‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన కుడిచేతికి గాయమవడంతో డాక్టర్లు కుట్లు వేశారు. కాగా, దాడికి పాల్పడిన నిహాంగ్ సిఖ్ జస్పాల్ సింగ్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పుణెకు చెందిన న్యాయవాదిగా గుర్తించారు. ఆయన గత రెండేండ్లుగా ఈ గురుద్వారాలో సేవకుడిగా పనిచేస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ హర్‌‌‌‌‌‌‌‌సిమ్రత్ కౌర్ బాదల్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేసి సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్  ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.