‘అగధ’ సినిమా కోసం బుద్ధిజం పుస్తకాల్ని చదివానని, బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నానని కామాక్షి భాస్కర్ల చెప్పింది. ఆమె ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు దర్శకుడిగా కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (Aug14) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల చెప్పిన విశేషాలు.
‘‘‘మనసంతా నువ్వే’ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఎం.ఎస్. రాజు గారి నుంచి ‘అగధ’ కోసం ఫోన్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో నేను దేవుడి అనుగ్రహంతో పుట్టే మహాదేవి పాత్ర పోషించా. ధర్మం కోసం నిలబడే పాత్ర అది. ఈ క్యారెక్టర్ కోసం చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది.
యాక్షన్ సీక్వెన్స్ కోసం ముందుగానే వర్క్ షాప్స్ చేశాం. ఇందులో అందరూ సీనియర్ నటులే కావడంతో వారినుంచి చాలా నేర్చుకున్నా. భానుచందర్, షిజు ఇలా అందరితో నటించడం ఆనందంగా అనిపించింది.
ఈ చిత్రంలో ఎక్కువ హారర్ మూమెంట్స్ ఉండవు. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. డివైన్ మూమెంట్స్ చాలా ఉంటాయి. చివరికి ఓ డివైన్ ఫీలింగ్ వస్తుంది. శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం నాపై మరింత బాధ్యతపెరిగింది. నా కెరీర్‌లో పొలిమేర, అగధ వంటి థ్రిల్లర్ జానర్స్ రిపీట్ అవుతున్నా.. పాత్రలు మాత్రం కొత్తగానే ఉంటున్నాయి. నెక్స్ట్ ఓ లవ్ స్టోరీ చేస్తున్నా. అలాగే ‘పొలిమేర 3’ కూడా ఉంది’’.
