సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. 2026 సెప్టెంబర్ 30వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటనలో భాగంగా కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం.. సిరిసిల్ల చేరుకుని పాదయాత్ర ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సిరిసిల్ల పాతబస్టాండ్ నేతన్న విగ్రహం మీదుగా పాదయాత్ర సాగుతోంది. రగుడు బైపాస్ వరకు పాదయాత్రగా వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
సిరిసిల్ల పాదయాత్రకు నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల తదితర మంత్రులతో పాటు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు పాదయాత్రలో పాల్గొన్నారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర సాగనుంది.
ఈ సందర్భంగా సిరిసిల్లలోరూ.350 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కోనరావు పేట, సిరిసిల్లలో పబ్లిక్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఆర్డీఓ, తహశీల్దార్ భవనం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
