Shruti Haasan: బిడ్డను కనాలనుకుంటున్న.. పెళ్లి మాత్రం చేసుకోను.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్

Shruti Haasan: బిడ్డను కనాలనుకుంటున్న.. పెళ్లి మాత్రం చేసుకోను.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్

సినిమాలతోనే కాదు.. తన బోల్డ్ అండ్ క్లియర్ ఒపీనియన్స్‌తోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan). ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత జీవితం విషయంలో తన ఆలోచనలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే ఆమె.. తాజాగా మ్యారేజ్‌పై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. పెళ్లి పేరుతో జరిగే భారీ ఖర్చులు, ఆడంబరాలపై ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నటి సోహా అలీఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్.. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అనుబంధానికి సంబంధించిన విషయమే తప్ప.. భారీ వేడుకలు, ఖర్చులు, కాగితాల వ్యవహారం కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జీవితంలో తాను ఎప్పుడూ ఒకే బాక్స్‌లో ఇమిడిపోవాలని అనుకోలేదని చెప్పారు.

పెళ్లి పేరుతో అంత ఖర్చెందుకు?

‘‘నాకు కంపానియన్‌షిప్ అంటే ఇష్టం. నా భాగస్వామి, నేను ప్రతిరోజూ ఒకరినొకరం ఎంచుకోవడం నాకు నచ్చుతుంది. కానీ దానికి తప్పనిసరిగా పేపర్‌వర్క్ అవసరం లేదు. పెళ్లి పేరుతో భారీగా ఖర్చు చేయడం, ఆడంబరంగా సెలబ్రేట్ చేయడం చూస్తే.. అసలు మనం ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం? అనిపిస్తుంది’’ అని శ్రుతి హాసన్ అన్నారు.

అయితే భారీగా ఖర్చు చేసేవారిని తాను తప్పుపట్టడం లేదని స్పష్టం చేసిన ఆమె.. అంత డబ్బును ఇతరులకు ఉపయోగపడేలా దానం చేస్తే మరింత సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఆ డబ్బును ఛారిటీకి ఇవ్వొచ్చు కదా!’’ అంటూ తనదైన స్టైల్‌లో కామెంట్ చేశారు.

పెళ్లి పీటల దాకా వెళ్లి.. వెనక్కి!

పెళ్లిపై తనకున్న సందేహాల గురించి మాట్లాడిన శ్రుతి హాసన్.. గతంలో తాను ఒకసారి పెళ్లికి చాలా దగ్గరగా వెళ్లిన విషయాన్ని కూడా వెల్లడించారు. అయితే చివరి దశలో ఆ బంధం పెళ్లిగా మారలేదని చెప్పారు. పెళ్లి ఆలోచన తనను అంతగా భయపెట్టలేదని, కానీ వివాహాన్ని కేవలం చట్టపరమైన ఒప్పందంగా చూడటం మాత్రం తనకు నచ్చదని పేర్కొన్నారు.

ఇదే విషయంపై గతంలోనూ ఆమె స్పందించారు. ‘‘నా సొంత గుర్తింపును సంపాదించుకోవడానికి జీవితమంతా కష్టపడ్డాను. దాన్ని ఒక పేపర్‌తో పెళ్లికి ముడిపెట్టాలనే ఆలోచన నాకు భయంగా అనిపిస్తుంది’’ అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి వద్దన్నంత మాత్రాన కమిట్‌మెంట్, లాయల్టీకి తాను వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు.

‘అమ్మ’ కావాలనుకుంటున్నా..

ఇక మాతృత్వంపై కూడా శ్రుతి హాసన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. భవిష్యత్తులో తల్లిగా మారాలని ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పారు. ఇందుకోసం దత్తత తీసుకునే ఆలోచన కూడా ఉందని, అదే సమయంలో బయలాజికల్‌గా బిడ్డను కనాలనే కోరిక కూడా ఉందని వెల్లడించారు. మొత్తానికి.. పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే ప్రశ్న కంటే.. జీవిత భాగస్వామితో ప్రతిరోజూ ఒకరినొకరు ఎంచుకోవడమే ముఖ్యమని శ్రుతి హాసన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. శ్రుతి హాసన్ చివరిగా రజినీకాంత్ నటించిన ‘కూలీ’లో కనిపించారు. పెద్ది లో స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘ట్రైన్’, దుల్కర్ సల్మాన్‌తో ‘ఆకాశంలో ఒక తార’ వంటి సినిమాలు ఆమె లైనప్‌లో ఉన్నాయి.