ఫండ్స్ ఎక్కువ.. ఫ్యాకల్టీ తక్కువ.. తనిఖీల్లో ప్రైవేట్ వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల బాగోతం బట్టబయలు

ఫండ్స్ ఎక్కువ.. ఫ్యాకల్టీ తక్కువ.. తనిఖీల్లో ప్రైవేట్ వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల బాగోతం బట్టబయలు
  • ఫీజుల వసూళ్లలో టాప్.. సౌకర్యాల్లో మాత్రం అంతంతే
  • తనిఖీల్లో బయటపడ్డ ప్రైవేట్ వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల బాగోతం
  • నేడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీలు, పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో, అర్హులైన ఫ్యాకల్టీని నియమించడంలో విఫలమయ్యాయి. సర్కారు నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ విద్యాసంస్థల దందా అధికారుల తనిఖీల్లో బయటపడింది. తెలంగాణలో 12 ప్రైవేట్ యూనివర్సిటీలు, 8 డీమ్డ్ వర్సిటీలు, మరో 20 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల 21 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరిగాయి. 

ఈ తనిఖీల కోసం విద్యాశాఖ అధికారులతోపాటు రెవెన్యూ, ఫైనాన్స్, ఆడిట్ శాఖల అధికారులతో కూడిన 25 ప్రత్యేక టీములను రంగంలోకి దించారు. ఒక్కో టీమ్‌‌‌‌లో ఎనిమిది మంది సభ్యులు ఉండి.. సుప్రీంకోర్టు అడిగిన 9 కీలక అంశాలపై ఆయా కాలేజీల్లో విచారణ జరిపారు. వర్సిటీల ఏర్పాటు వెనుక ఉద్దేశం, అడ్మిషన్ల ప్రక్రియ, సిబ్బంది నియామకం, భూములు, నిధుల ఆడిట్, వాటి మళ్లింపు తదితర అంశాలను పరిశీలించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

 ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. తనిఖీల్లో ప్రధానంగా ఫ్యాకల్టీ కొరత వేధిస్తున్నట్లు తేలింది. పేపర్‌‌‌‌పై ఉన్న స్టాఫ్‌‌‌‌కు, కాలేజీల్లో ఉన్న వారికి పొంతన లేదని అధికారులు గుర్తించారు. స్టూడెంట్-లెక్చరర్ నిష్పత్తి అస్తవ్యస్తంగా ఉండటంతో బోధన నాణ్యత పడిపోతోంది. మరోవైపు, యూనివర్సిటీల వద్ద ఫండ్స్ భారీగా ఉన్నా ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. 

రికార్డుల్లో చూపిస్తున్న జీతాలకు, చేతికి అందుతున్న మొత్తానికి తేడాలు ఉన్నట్లు తనిఖీ బృందాలు అనుమానిస్తున్నాయి. ఏటా తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ అకౌంట్స్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలన్న నిబంధనను ప్రైవేట్ వర్సిటీలు తుంగలో తొక్కాయి. ఏ వర్సిటీ కూడా ఇప్పటివరకు సక్రమంగా ఆడిట్ వివరాలు ఇవ్వలేదని అధికారుల విచారణలో తేలింది. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫండ్స్ ఎక్కడికి పోతున్నాయి? మౌలిక వసతులపై ఎంత ఖర్చు చేస్తున్నారు? అన్న విషయాలపై స్పష్టత కరువైంది.

నేడు ‘సుప్రీం’కు నివేదిక..

సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సిద్ధం చేసింది. కాలేజీల్లో ఉన్న లోటుపాట్లు, ఫ్యాకల్టీ కొరత, ఫైనాన్షియల్ అక్రమాలపై నేడు అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.