జగిత్యాల టౌన్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా, డయాలసిస్, తలసేమియా బాధితులు, చేనేత, గీత కార్మికులు నూతన పెన్షన్ల కోసం ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2,18,002 మందికి నెలకు సుమారు రూ. 47 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామని, దానికి అదనంగా ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 200 కోట్లతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మిస్తున్నామన్నారు. గురుకులాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.వెయ్యి కోట్ల బిల్లులను క్లియర్ చేశామని వెల్లడించారు.
