- దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్న బీజేపీ
- సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి
- పర్యటనను సక్సెస్ చేయాలను పిలుపు
కరీంనగర్ సిటీ, వెలుగు: ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల పర్యటనను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రూ.60 కోట్లతో నిర్మించిన కరీంనగర్ కలెక్టరేట్ భవనం, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతోపాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లోని తన క్యాంప్ ఆఫీసులో ఆదివారం నరేందర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ లో బీజేపీ నాయకుల డ్రామాలు, దాడులు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. మొన్న నీటి విడుదలపై డ్రామా చేశారని, నిన్న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో కాంగ్రెస్ నాయకుడిపై దాడికి పాల్పడ్డారని ఫైర్అయ్యారు. దాడుల సంస్కృతి సరికాదని ఓపిక పడుతున్నామని.. ఇకపై చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల భూభాగోతాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే బట్టబయలు చేయడంతో ఆయన పర్యటన అనగానే ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేటర్లు నర్సింగం, మల్లేశం, జగన్ రెడ్డి, నాయకులుశ్రీనివాస్ రెడ్డి, షబానా మహ్మద్, ఎ.తిరుమల, జ్యోతి రెడ్డి, భారీ, కీర్తి కుమార్, అంజయ్య, సత్యనారాయణ రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
