మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళలు మృతి చెందడం, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. నస్పూర్ గేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆటో లారీని ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.మృతులు మందమర్రి మండలానికి చెందినవారిగా సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
