గేటెడ్ కమ్యూనిటీలో ట్రాఫిక్ జామ్ ఏంటీ.. ఎంచక్కా అలా కారెక్కి.. ఇలా బయటకు వెళ్లొచ్చు కదా.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. కారు తీసుకుని రోడ్డెక్కటానికి 5 నిమిషాలు కూడా పట్టదు.. అలాంటిది గేటెడ్ కమ్యూనిటీలో ట్రాఫిక్ జామ్ కావటం ఏంటీ.. అది కూడా అర గంట ఏంటీ.. ఇప్పటి వరకు ఎప్పుడూ వినని.. ఎక్కడా చూడని ఈ ట్రాఫిక్ ఇన్సిడెంట్ మన బెంగళూరు మహా నగరంలోనే జరిగింది.. ఇంతకీ గేటెడ్ కమ్యూనిటీలోని ట్రాఫిక్ జామ్ వివరాలు పూర్తిగా తెలుసుకుందామా...
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో బెంగళూరులోని దారుణమైన ట్రాఫిక్ పరిస్థితికి అద్దం పడుతోంది. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ బయట ఉన్న రోడ్డుపై అప్పటికే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అయితే అసలు ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ లోపల కూడా కార్లు బయటికి వచ్చేందుకు వరుసగా బారులు తీరాయి.
శనివారం మధ్యాహ్నం ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసిన ఒక మహిళ తెలిపిన వివరాల ప్రకారం, ఇక్కడి నివాసితులు వాళ్ళ ఇళ్ల నుంచి బయలుదేరి అపార్ట్‌మెంట్ గేటు (Exit gate) దాటి మెయిన్ రోడ్డుపైకి రావడానికే దాదాపు 30 నిమిషాల సమయం పడుతోంది. ఇంకా ఆఫీసులకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణం మొదలుకాక ముందే, అపార్ట్‌మెంట్ లోపలే సగం సమయం వృథా అయిపోతోంది.
సోషల్ మీడియాలో కామెంట్లు
ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే బెంగళూరు ట్రాఫిక్ సమస్య ఇప్పుడు అధికారికంగా ప్రజల ఇళ్ల ముంగిట్లోకి ఎంటర్ అయిపోయిందని ఫన్నీగా సెటైర్స్ వేస్తున్నారు.
వీడియో ఆధారంగా కొంతమంది ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్ వర్తూర్ (Varthur) ప్రాంతంలో ఉన్న 'బ్రిగేడ్ కార్నర్‌స్టోన్ యూటోపియా' (Brigade Cornerstone Utopia) గా గుర్తించారు.
ఒక నెటిజన్ మాట్లాడుతూ "ఈ కాంప్లెక్స్ లోపలే మాల్స్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కానీ బిల్డర్లు ఎంట్రీ, ఎగ్జిట్ (In & Out) మార్గాలను సరిగ్గా ప్లాన్ చేయలేదు. ఇక్కడ ఇన్వెస్టర్లు లాభాల్లో ఉంటే, ఇళ్లలో ఉండే వాళ్ళు మాత్రం రోజు నరకం చూస్తున్నారు" అని అన్నారు. మరో నెటిజన్ "ప్రజలు ఈ సొసైటీ వదిలి అసలు బయటకే వెళ్లకుండా ఉండేలా దీనిని డిజైన్ చేసినట్లున్నారు" అని కామెంట్ చేశారు.
సాధారణంగా సిటీ నగరాల్లోని మెయిన్ రోడ్లపైనే ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. కానీ వేల సంఖ్యలో ఫ్లాట్లు ఉండే మెగా అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులో సరైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ లేకపోవడం, ఎగ్జిట్ గేట్లు చిన్నగా ఉండటం, బయట ఉన్న రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఈ కొత్త సమస్య మొదలైంది. బెంగళూరు వాసులకు రోజు ఉండే సాధారణ సమస్యలుగా మారిన ప్రయాణ కష్టాలకు ఈ ఘటన ఒక సరికొత్త ఉదాహరణగా నిలిచింది
