నంది మేడారం పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోతలు

నంది మేడారం పంప్‌హౌస్‌ నుంచి ఎత్తిపోతలు
  •     ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు  కొనసాగుతున్న గోదావరి జలాల తరలింపు
  •     నాలుగు మోటర్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు

కరీంనగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కాల్వ, జంట సొరంగాల ద్వారా నంది పంప్ హౌస్‌లోని సర్జిపూల్‌కు తొలుత గోదావరి జలాలు చేరుకుంటున్నాయి. అక్కడ 4 మోటార్లను ఆన్ చేయడంతో 12,600 క్యూసెక్కుల నీరు డెలివరీ సిస్టర్న్‌ ద్వారా నంది రిజర్వాయర్‌‌లోకి చేరుకుంటోంది. 

అక్కడి నుంచి రిజర్వాయర్ క్రస్ట్‌ గేట్లు ఎత్తి 12,600 క్యూసెక్కుల నీటిని జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌‌లోని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ లో 4 బాహుబలి మోటార్లను ఆన్ చేయడంతో అంతే పరిణామంలో జలాలు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు చేరుకుంటున్నాయి. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు 9,500 క్యూసెక్కుల నీళ్లను వదులుతున్నారు. ప్రస్తుతం మిడ్ మానేరులో 27.55 టీఎంసీలకుగాను 24 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా.. లోయర్ మానేరు డ్యామ్ లో 24 టీఎంసీలకుగానూ 15 టీఎంసీల నీటి నిల్వకు చేరుకుంది.