హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్లకు హౌసింగ్ బోర్డు టెండర్లు పిలిచింది. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో టెండర్లు పిలవగా తాజాగా మరో 4 నియోజకవర్గాలకు ఆదివారం టెండర్లు ఆహ్వానించింది. ఇందులో ఎల్‌బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో చోట 480 ఫ్లాట్ల చొప్పున రూ. 43.20 కోట్ల అంచనా వ్యయంతో టవర్లను నిర్మించనున్నారు.
వీటికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 22 వరకు టెండర్ల దాఖలుకు హౌసింగ్ బోర్డు గడువు విధించింది. మరోవైపు, పాటిగడ్డలో 480 ఫ్లాట్లకు, కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్‌పల్లిలో 140 ఫ్లాట్లకు సంబంధించి రూ.55.80 కోట్ల వ్యయంతో చేపట్టే టవర్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు రెండోసారి టెండర్లు పిలిచింది. వీటికి సోమవారం నుంచి వచ్చే నెల 10 వరకు గడువును కేటాయించింది.
