ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ షెడ్యూల్పై సింధు విమర్శలు

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ షెడ్యూల్పై  సింధు  విమర్శలు
  • క్వార్టర్స్‌‌లో చెన్‌‌ యూఫెయి చేతిలో ఓటమి

నాగోయా, వెలుగు: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌‌ షెడ్యూలింగ్‌‌పై భారత స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లో మూడు సింగిల్స్‌‌ మ్యాచ్‌‌లు ఆడాల్సి రావడంతో తగినంత విశ్రాంతి, రికవరీ సమయం లభించలేదని తెలిపింది. శనివారం మధ్యాహ్నం రెండో రౌండ్‌‌ మ్యాచ్‌‌ ఆడిన సింధు.. మూడో రౌండ్‌‌ మ్యాచ్‌‌ను ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ముగించింది.

అనంతరం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు చైనాకు చెందిన చెన్‌‌ యూఫెయితో క్వార్టర్‌‌ఫైనల్లో తలపడి,  ఓటమి పాలైంది. “షెడ్యూల్‌‌ అంతగా సక్రమంగా లేదనిపించింది. మేం చాలా ఆలస్యంగా నిద్రపోయి.. ఉదయాన్నే తిరిగి కోర్టులోకి రావాల్సి వచ్చింది. రికవరీ అత్యంత ముఖ్యం” అని సింధు పేర్కొంది.

మూడు మ్యాచ్‌‌లకు మానసికంగా సిద్ధం కావడం కంటే శారీరకంగా కోలుకోవడమే ముఖ్యమని చెప్పింది. సుదీర్ఘ ర్యాలీల సమయంలో అలసట ప్రభావం చూపుతుందని తెలిపింది. మరో భారత షట్లర్‌‌ ఉన్నతి హుడా కూడా షెడ్యూల్‌‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే తన క్వార్టర్స్‌‌ ఓటమికి షెడ్యూల్‌‌ను కారణంగా చూపబోనని స్పష్టం చేసింది. క్వార్టర్‌‌ఫైనల్‌‌ మ్యాచ్‌‌లో హాక్‌‌ఐ సదుపాయం లేకపోవడంపైనా సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది.