ఆడనున్న భారత మహిళల జట్టు
కోల్‌కతా, వెలుగు: భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు తొలిసారి కోల్‌కతాలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 8, 11 తేదీల్లో కిశోర్ భారతి క్రీడాంగణంలో రష్యాతో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో ‘బ్లూ టైగ్రెసెస్’ తలపడనుంది. ఫిఫా మహిళల అంతర్జాతీయ మ్యాచ్ విండోలో భాగంగా ఈ పోటీలు జరగనున్నాయి. జూన్‌లో రికార్డు స్థాయిలో ఆరోసారి సాఫ్ మహిళల చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టుకు ఇవే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 69వ స్థానంలో ఉండగా.. రష్యా 27వ ర్యాంక్‌లో ఉంది.
దీంతో బలమైన యూరోపియన్ జట్టుతో పోటీ పడే అవకాశం భారత ప్లేయర్లకు లభించనుంది. పశ్చిమ బెంగాల్‌లో భారత మహిళల జట్టు చివరిసారిగా 2016 సాఫ్ చాంపియన్‌షిప్‌లో ఆడింది. సిలిగురిలో జరిగిన ఆ టోర్నీలో భారత్ టైటిల్ సాధించింది. కాగా, రష్యా మహిళల జట్టు చివరిసారిగా 1994లో భారత్‌కు వచ్చింది. చెన్నైలో జరిగిన జయలలిత కప్‌లో పాల్గొన్న రష్యా రన్నరప్‌గా నిలిచింది. భారత్, రష్యా ఇప్పటివరకు రెండుసార్లు తలపడ్డాయి. 2021 టర్కిష్ ఉమెన్స్ కప్‌లో భారత్ 0-8తో ఓడగా.. 2025 పింక్ లేడీస్ కప్‌లో 0-2 తేడాతో పరాజయం ఎదురైంది.
రష్యాతో మ్యాచ్‌లు జట్టు అభివృద్ధికి ఉపయోగపడతాయని భారత కోచ్ క్రిస్పిన్ చెత్రి తెలిపారు. ఫలితాలతో పాటు యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం, ఉన్నత స్థాయి ప్రత్యర్థులతో ఆడించే అనుభవం అందించడం ముఖ్యమన్నారు. సెప్టెంబర్ 18 నుంచి కోల్‌కతాలో భారత జట్టు శిక్షణ పొందుతోంది. మ్యాచ్‌లకు సమీపంలో తుది జట్టును ప్రకటించనున్నారు.
