- అథ్లెటిక్స్లో రెండు సిల్వర్లు.. మూడు కాంస్యాలు.. స్క్వాష్‌లో రెండు సిల్వర్లు
- ఒకేరోజు ఏడు పతకాలతో అదరగొట్టిన భారత అటగాళ్లు..
- మొత్తం 37కు చేరిన మెడల్స్
నాగోయా, వెలుగు: ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ జట్టు మరో ఐదు పతకాలు సాధించగా..స్క్వాష్‌లో రెండు మెడల్స్ దక్కాయి. ఆదివారం లాంగ్‌జంప్‌లో ఆంసీ సోజన్, హైజంప్‌లో సర్వేశ్ కుషారే రజతాలు గెలుచుకున్నారు. డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్, 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌధరీ, 200 మీటర్ల పరుగులో హరీతా భద్ర కాంస్యాలు సాధించారు. స్వ్కాష్ లో - అబయ్, అనహత్ సింగ్ రజతాలు సాధించారు.
దీంతో భారత్ పతకాల సంఖ్య మొత్తం 37 కు చేరింది. ఇందులో 4 గోల్డ్, 16 సిల్వర్, 17 కాంస్య పతకాలు ఉన్నాయి. మహిళల లాంగ్‌జంప్‌లో ఆంసీ సోజన్ 6.53 మీటర్లతో స్వర్ణం దిశగా దూసుకెళ్లింది. అయితే చైనాకు చెందిన హువాంగ్ యింగ్‌యింగ్ చివరి ప్రయత్నంలో 6.55 మీటర్లు దూకి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆంసీకి రజతం దక్కింది. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుషారే 2.25 మీటర్లు దూకి రజతం సాధించాడు. చైనీస్ తైపీకి చెందిన చావో-హ్సువాన్ ఫూ కూడా 2.25 మీటర్లు క్లియర్ చేసినా తక్కువ ప్రయత్నాల్లో ఎత్తును అధిగమించడంతో స్వర్ణం గెలిచాడు.
డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ 7,934 పాయింట్లతో కాంస్యం గెలిచాడు. 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పారుల్ చౌధరీ 9:08.67 నిమిషాల్లో రేసు పూర్తి చేసి తన జాతీయ రికార్డును మెరుగుపర్చుకుంది. అయినా కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల 200 మీటర్లలో హరీతా భద్ర 23.20 సెకన్లలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, డేవిడ్ సోలమన్, 400 మీటర్ల హర్డిల్స్‌లో సంతోష్ తమిళరసన్, విథ్యా రామరాజ్, అనూ రాఘవన్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు.
స్క్వాష్‌లో చేజారిన గోల్డ్.. ఫైనల్లో మలేషియా ప్లేయర్ల చేతిలో ఓటమి
ఆసియా క్రీడల స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో అబయ్ సింగ్, మహిళల సింగిల్స్‌లో అనహత్ సింగ్ ఫైనల్ వరకు చేరి సిల్వర్ మెడల్స్ సాధించారు. అయితే తుది పోరులో మలేషియా ప్రత్యర్థుల చేతిలో ఓటమి ఎదురైంది. పురుషుల ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ అబయ్‌ను డిఫెండింగ్ చాంపియన్ ఎన్ ఇయాన్ యో 11-9, 11-5, 11-5తో ఓడించాడు. తొలి గేమ్‌లో అబయ్ గట్టి పోటీ ఇచ్చినా.. కీలక సమయంలో మలేషియా ఆటగాడు పైచేయి సాధించాడు. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకుని మ్యాచ్‌ను ముగించాడు.
మహిళల ఫైనల్లో 18 ఏళ్ల అనహత్‌కు ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ శివసంగరి సుబ్రమణియం ఎదురైంది. ఆమె 11-4, 11-4, 11-7తో అనహత్‌పై విజయం సాధించింది. తొలి రెండు గేమ్‌ల్లో ఆధిపత్యం చూపిన శివసంగరి.. మూడో గేమ్‌లోనూ కీలక పాయింట్లు సాధించి టైటిల్ దక్కించుకుంది. అయితే ఆసియా క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో ఇద్దరు భారత ప్లేయర్లు ఫైనల్ చేరి రజతాలు సాధించడం విశేషం. స్క్వాష్‌లో వ్యక్తిగత స్వర్ణం కోసం భారత్ నిరీక్షణ మాత్రం కొనసాగుతోంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని ఇద్దరూ కోల్పోయారు.
