కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి : ఎమ్మెల్సీ కోదండరాం

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలి  : ఎమ్మెల్సీ కోదండరాం
  •     పాలమూరు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్సీ కోదండరాం

వంగూరు, వెలుగు : కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను తేల్చాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌‌ కోదండరాం డిమాండ్ చేశారు. పాలమూరు జలసాధన సమితి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు నిర్వహించిన పాదయాత్రలో కోదండరాంతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ వాటా విషయంలో చట్టపరమైన పరిమితులు, ఇతర అంశాల పేరుతో పదేండ్లుగా కాలయాపన చేశారని విమర్శించారు. ప్రస్తుతం బాధ్యతలను కమిటీకి అప్పగించినప్పటికీ అది ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందో  స్పష్టత లేదన్నారు. 

గత ప్రభుత్వం నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసి ఉంటేపాలమూరు ప్రాంతంలోని అనేక ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యేవన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌‌సాగర్‌‌తో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని కోరారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ డిండి నుంచి నల్గొండ జిల్లాకు నీటి తరలింపును ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జలసాధన సమితి నాయకులు రాజేందర్ రెడ్డి, రాఘవాచారి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజ్, బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి, జంగయ్య, పరుశరాములు, మంద రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.