పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని కృష్ణగిరి క్షేత్రంలో పులి సంచారం ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పరిగి అటవీశాఖ రేంజ్ అధికారి ప్రతిమ తెలిపారు. ఆదివారం కృష్ణగిరి క్షేత్రంలో పులి సంచారం ఉందంటూ స్థానిక సోషల్ మీడియాలో కథనాలు రావడంతో రేంజ్ అధికారి ప్రతిమ సంఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.
పులి సంచారానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పులిగా ప్రచారం చేసిన జంతువు ఆనవాళ్లను పరిశీలించగా అవి హైనా లేదా రేసు కుక్కల పోలికలను కలిగి ఉన్నాయని తెలిపారు. బసిరెడ్డిపల్లి గ్రామస్తులు ఎవరూ అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని సూచించారు. డిప్యూటీ రేంజ్ అధికారి వేణుగోపాల్, రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.
