నాగోయా, వెలుగు: ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. 400 మీటర్ల హర్డిల్స్ అథ్లెట్ యశస్ పాలక్ష ఆదివారం హీట్ రేసులో తొలి హర్డిల్ కూడా దాటకముందే గాయంతో రేసు నుంచి వైదొలిగాడు. దీంతో అతడి ఫలితాన్ని ‘డీఎన్‌ఎఫ్’గా నమోదు చేశారు. యశస్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయినట్లు భావిస్తున్నారు. అతడి గాయాన్ని జట్టు వైద్యులు పరీక్షించినట్లు ఓ కోచ్ తెలిపారు.
ఇటీవల భారత అథ్లెటిక్స్ సిరీస్ ఫైనల్లో యశస్ పాల్గొనకపోవడంతో అప్పటినుంచే అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సెప్టెంబర్ 10న ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో ఆసియా క్రీడలకు ఎంపికైన దాదాపు అందరు అథ్లెట్లు పాల్గొన్నారు. ఇక శనివారం మహిళల 100 మీటర్ల హర్డిల్స్ స్టార్ జ్యోతి యర్రాజీ వార్మప్‌లో మోకాలిలో నొప్పి రావడంతో రేసుకు దూరమైంది. ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ తొలి ప్రయత్నం పూర్తిచేయకుండానే కాలి గాయంతో వైదొలిగాడు.
