సిరిసిల్లలో మంత్రుల సన్నాహక సమావేశం

సిరిసిల్లలో మంత్రుల సన్నాహక సమావేశం
  •     సిరిసిల్లపై సీఎం దృష్టి పడింది.. మీ పంట పండింది: మంత్రి తుమ్మల
  •     రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు: శ్రీధర్​బాబు
  •     సీఎం సభను విజయవంతం చేయాలని నేతల పిలుపు

సిరిసిల్ల టౌన్, వెలుగు: ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్​రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్​హాల్​లో సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్​బాబు, అడ్లూరి లక్ష్మణ్​కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్​చార్జి కే కే మహేందర్ రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ విజయ రమణారావు తదితరులు హాజరయ్యారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సిరిసిల్లపై సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లా ప్రజల పంట పండినట్లేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్​పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. రైతులు, నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తాను ఎమ్మెల్యేగా ఎదగడానికి కాంగ్రెస్​పార్టీనే కారణమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​అన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. సిరిసిల్లలో సుమారు రూ.వెయ్యి కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తోందని తెలిపారు. రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, కొత్త రేషన్​కార్డులు, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రూ.250 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.