- సిరిసిల్లలో ముదిరాజ్ గర్జన బహిరంగ సభ
సిరిసిల్ల టౌన్, వెలుగు : ముదిరాజ్ లు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో శనివారం జరిగిన ముదిరాజ్ గర్జన బహిరంగ సభకు మంత్రి వాకిటి శ్రీహరి, శాసన మండలి చైర్మన్ ప్రకాశ్ ముదిరాజ్, విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్కల రాముతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. బీసీల హక్కుల కోసం పార్లమెంట్, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బీసీలకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ముదిరాజ్, బీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి బీసీల జనాభాను అధికారికంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కుల ఆత్మ గౌరవ భవనానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నామని, ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మంత్రి వాకిటి మాట్లాడుతూ ముదిరాజ్ లను బీసీ డీ కేటగిరీలో చేర్చే ప్రక్రియ ముందుకు సాగుతోందని, సాధ్యమైనంత త్వరగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు.
కరీంనగర్ బస్‌స్టేషన్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
కరీంనగర్ టౌన్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. కరీంనగర్ బస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. తాను 2013లో ఎంపీగా ఉన్న సమయంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ బస్‌స్టేషన్‌కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టామని.. 13 ఏళ్ల తర్వాత అదే ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
విగ్రహావిష్కరణకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, దొంత రాజయ్య తదితరులను అభినందించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్, అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రీజనల్ కార్యదర్శి దొంత రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
