మంథని, వెలుగు: వాగులో మునిగిపోతున్న బాలికను ధైర్యసాహసాలతో రక్షించిన ఇద్దరు యువకులను గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్అభినందించి సన్మానించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని బొక్కలవాగు వద్ద బోయినిపేటకు చెందిన పర్శవేన రాజు తన కుమార్తె అలేఖ్యతో కలిసి తమ గొర్రెల మందను బొక్కల వాగు దాటించే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు రాజు నీటి ప్రవాహంలో జారిపడ్డాడు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన అలేఖ్య కూడా నీటిలో మునిగిపోతూ కేకలు వేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అంకం శేఖర్వెంటనే స్పందించి నీటిలోకి దిగి అలేఖ్యను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు.
అప్పటికే ఆమె స్పృహ కోల్పోవడంతో శేఖర్, ఆకుల అరవింద్కలిసి ప్రథమ చికిత్స అందించడంతో స్పృహలోకి వచ్చింది. అనంతరం అలేఖ్య తన తండ్రి కూడా నీటిలో మునిగిపోయినట్లు చెప్పడంతో ఇద్దరూ వాగులోకి దిగి రాజును బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి బాలికను కాపాడటంతో పాటు ఆమె తండ్రిని రక్షించేందుకు ప్రయత్నించిన శేఖర్, అరవింద్ ధైర్యసాహసాలను ఏసీపీ ఎం.రమేశ్అభినందించారు. గురువారం ఏసీపీ కార్యాలయంలో మంథని సీఐ బుద్ధె స్వామి, ఎస్సై సాగర్తో కలిసి వారిని శాలువాలతో సన్మానించారు.
