భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు

భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక పూజలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఆంతరంగికంగా పంచామృతాభిషేకం, బంగారు పుష్పాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అభిషేకం చేసి, అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన జరిపారు. మిథిలా ప్రాంగణంలో సీతారాముల నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. టీటీడీ సభ్యుడు అక్కిన ముని కోటేశ్వరరావు స్వామివారిని దర్శించుకోగా, ఈవో దామోదర్‌‌రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. 

అనంతరం వేదాశీర్వచనం, ప్రసాదం, జ్ఞాపికలు అందజేశారు. కాగా, రామాలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రాకారాల్లో ఏర్పాటు చేసే శిల్పాల తయారీ గోకుల రామంలో ప్రారంభమైంది. మరోవైపు, ఆదివారం రాత్రి భద్రాచలం స్నానఘట్టాల వద్ద గోదావరి నదికి వైభవంగా నదీహారతి నిర్వహించారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.