- మండల ప్రజావాణి ప్రారంభం నేపథ్యంలో ఎంపీడీవోలకు ట్రైనింగ్
హైదరాబాద్, వెలుగు : ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆఫీసర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి రాష్ట్ర ఇన్ చార్జి డాక్టర్ జి. చిన్నారెడ్డి చెప్పారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి ప్రారంభం కానున్న మండల ప్రజావాణి కార్యక్రమ నిర్వహణపై గురువారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో 560 మంది ఎంపీడీవోలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల ప్రజావాణి నోడల్ అధికారులుగా ఎంపీడీవోలను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఓపికగా స్వీకరించి, క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి ద్వారా ఇప్పటికే 75 శాతం దరఖాస్తులను పరిష్కరించామని, మండల స్థాయిలోనూ ఇదే పురోగతి సాధించాలన్నారు. ప్రజావాణి కేంద్రాల్లో శాఖల వారీగా డెస్క్‌లు, హెల్ప్‌డెస్క్‌లు, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని.. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర నోడల్ అధికారి కె.విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలే యజమానులని, అధికారులు ప్రజాసేవకులనే ప్రాథమిక సూత్రాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
సీఎం కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ప్రజావాణికి వచ్చే బాధితులకు అధికారులు భరోసా ఇవ్వాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ ప్రజల బాధలను ఓపికగా వింటేనే సగం సమస్య తీరినట్లవుతుందని, ఆర్జీల పరిష్కారానికి గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు.
