రైతులకు పథకాలు సకాలంలో అందేలా చర్యలు : మంత్రి తుమ్మల

రైతులకు పథకాలు సకాలంలో అందేలా చర్యలు : మంత్రి తుమ్మల
  •     ఎకో పాండ్లు, వెదురు సాగుపై దృష్టి పెట్టాలి: మంత్రి తుమ్మల
  •     9 వరి రకాలు సాగు చేసిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచన 
  •     రైతు సంక్షేమం, పంటలపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రైతులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విబ్‌‌‌‌జీ రామ్‌‌‌‌జీ పథకం కింద ఎకో పాండ్లు, వెదురు సాగుకు పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. 

ప్రభుత్వం సూచించిన 9 వరి రకాలు సాగు చేసిన రైతులు ఏఈఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునేలా రైతువేదికల్లో అవగాహన కల్పించాలన్నారు. యాంత్రీకరణ పథకంలో యంత్రాల పంపిణీలో జాప్యం ఉండొద్దని చెప్పారు. వరి అధికంగా పండించే జిల్లాల్లో 65 వేల టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు. శాఖల భూములు, ఆస్తుల వివరాలు ఇవ్వాలన్నారు. నకిలీ డీఏపీ కేసులో 8 మందిపై కేసులు నమోదు చేసి, 6 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలుపగా, మార్కెట్ యార్డులు, మిర్చి కోల్డ్ స్టోరేజీలనూ తనిఖీ చేయాలని సూచించారు. ఆర్‌‌‌‌కేవీవై రెండో విడత నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.  

 కొత్త ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ రకాలపై స్టడీ..

ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగును ఏటా 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని, కొత్త రకాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కోస్టారికాకు చెందిన ఏఎస్‌‌‌‌డీ కంపెనీ ప్రతినిధులు అధిక దిగుబడినిచ్చే కొత్త తరం ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ విత్తనాలపై మంత్రితో చర్చించారు. ఈ రకాలు తెలంగాణ వాతావరణానికి అనుకూలమో సమగ్రంగా అధ్యయనం చేసి, అనుకూలంగా ఉంటే రాష్ట్ర నర్సరీల్లో అభివృద్ధి చేయాలని తుమ్మల అధికారులను ఆదేశించారు.