ములుగు/ వెంకటాపూర్ వెలుగు: ఈ నెల 16న ములుగు జిల్లాలో సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గురువారం సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని, నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌తో కలిసి పరిశీలించారు.
పైలాన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన మంత్రి, భవనంలోని వివిధ విభాగాలు, కార్యాలయ గదులు, సమావేశ మందిరాలు, పరిసరాల్లో చేపడుతున్న పనులను పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎలాంటి లోటుపాట్లకు అవకాశం లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అప్పగించిన బాధ్యతలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16న సీఎం ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు. మధ్యాహ్నం మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. వనదేవతల సన్నిధి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారన్నారు.
అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మూడు విడతల్లో సుమారు రూ.16 వేల కోట్లతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారన్నారు. ఆ తర్వవాత కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసే సభలో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారన్నారు.
సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావు, లైబ్రరీ సంస్థ చైర్మన్ రవీందర్ చందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బిట్స్ పిలానీ హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ అవగాహన, ప్రణాళిక కార్యక్రమానికి సీతక్క హాజరయ్యారు.
