- అన్నం పెట్టిన వాళ్లను మరిచే బైమాన్‌ను కాదు
- సీఎం రేవంత్ రెడ్డి చేసిన డెవలప్‌మెంట్ కూడా చెబుతా
- డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు
- ఎమ్మెల్యే పోచారం కామెంట్స్
నిజామాబాద్, వెలుగు: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సెగ్మెంట్ పరిధిలోని వర్ని మండలం జాకోరా గ్రామంలో రూ.10 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మించిన మహిళా భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అన్నంపెట్టిన వాళ్లను మరిస్తే పుట్టగతులుండవ్. నేను అలాంటి బైమాన్‌ను కాదు’ అని పరోక్షంగా కేసీఆర్‌ను పొగిడారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన డెవలప్‌మెంట్ ను కూడా చెబుతానన్నారు. రెండ్రోజుల క్రితం తాను చేసిన కామెంట్స్‌లో రాజకీయ దురుద్దేశం లేదన్నారు.
‘బుద్ధిహీనులు నన్ను స్వార్థపరుడు అంటున్నరు. నిరూపిస్తే రాజకీయాలను వదులుకుంట. ఉన్న మాటే నేను మాట్లాడిన ఇందులో సీక్రెట్ ఏమీలేదు. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నన్ను ప్రజలు ఏడుసార్లు అసెంబ్లీకి పంపారు. వారి రుణం తీర్చుకోవాలె. నా జీవితం ప్రజల కోసమే..సంక్షేమం నా లక్ష్యం. కార్యకర్తలకు బాధ కావొద్దు. ఈ అంశాల ప్రాతిపదికన నా నిర్ణయాలుంటయ్’ అని అన్నారు. ఉన్నది మాట్లాడితే ఆ పార్టీలోకి పోతడు.. లేదు ఈ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నరు. నా నిర్ణయాల్లో నయాపైసా స్వార్థం ఉండదు. విద్యా, వైద్యం, రైతు అవసరాలు, ఆడవాళ్లకు ఇండ్లు ఇప్పించడం కోసం పదవిని వాడుతున్న’ అని పోచారం అన్నారు.
