వనపర్తి/పెద్దమందడి, వెలుగు : గణప సముద్రం రిజర్వాయర్ కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరఫున సరైన న్యాయం జరిగేలా బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి బుద్ధారం, ఖిల్లాగణపూర్ గణపసముద్రం భూ నిర్వాసితులతో నష్ట పరిహారం విషయంలో ముఖాముఖి చర్చలు జరిపారు.
గణప సముద్రంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గించకుండా బండ్ ఎత్తు పెంచుకుంటే రైతుల నుంచి సేకరించాల్సిన నికర భూమి తగ్గుతుందని, దాంతో ఇటు రైతులు అటు ప్రభుత్వానికి లాభం కలుగుతుందని, ఆ దిశగా సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. భూమి కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.11.25 లక్షలు పరిహారం చెల్లించాల్సి ఉందని, కానీ సన్న, చిన్నకారు రైతులు నష్టపోతున్నందున కాస్త పెంచి ఇచ్చే విధంగా చూడాలని కలెక్టర్ ను కోరారు.
ఇల్లు లేని పేద నిర్వాసితులు ఇందిరమ్మ ఇండ్లు సైతం మంజూరు చేసే బాధ్యత తనదని, రైతులు సహకరించాలని కోరారు. అంతకుముందు పెద్దమందడి మండలం అమ్మపల్లి, రేవల్లి మండలం శానాయపల్లిలలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు మాధవి, దూపణరాజు, రేవతి, అంజనమ్మ, టప్పరాజయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్. ఈ చంద్రశేఖర్, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ తిరుపతయ్య, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
