ఈ దేశంలో దళితులకు చోటు లేదా..? రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆవేదన

ఈ దేశంలో దళితులకు చోటు లేదా..? రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆవేదన

న్యూఢిల్లీ: ఈ దేశంలో దళితులకు చోటు లేదని కాంగ్రెస్ ​పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తాము ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నామని.. బీజేపీ వాళ్లు మతం పేరుతో ప్రజలందరినీ విభజిస్తున్నారని ఆరోపించారు. గత శనివారం ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని హల్ద్వానీలో ఉన్న రామ్‌‌‌‌‌‌‌‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ‘విజయ్ శంఖనాద్’ ర్యాలీని నిర్వహించింది. ఈ సభకు ఖర్గే హాజరై ప్రసంగించారు. 

ఈ సభ జరిగిన రెండు రోజుల తర్వాత (ఆగస్టు 10న) ‘శ్రీరామ్ సేన' అనే సంస్థ ఆ మైదానంలో 'శుద్ధీకరణ' పేరుతో హవనం (హోమం) నిర్వహించింది. కాగా, గురువారం వర్షాకాల సమావేశాల చివరి రోజున ఖర్గే ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. తాను ప్రసంగించిన సభా ప్రాంగణంలో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా అవమానించినట్టు ఉందంటూ వాపోయారు. ‘నేను ఏ మతాన్ని గానీ, వర్గాన్ని గానీ ఉద్దేశించి మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వ విధానాలపైనే మాట్లాడాను. కానీ, నేను వెళ్లిన తర్వాత ఆ వేదికను ‘శుద్ధి’ చేయడానికి పూజలు చేశారు. 

ఇది నన్ను తీవ్రంగా అవమానించింది. నా జీవితంలో అంటరానితనం వల్ల కలిగే బాధను మరోసారి అనుభవించేలా చేసింది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ దళితుడినని చెప్పుకుని రక్షణ లేదా భిక్ష కోరలేదని,  నాలో పోరాడే శక్తి ఉందని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వేళ ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. శుద్ధీకరణ పూజలు చేసిన వారిపై అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఘటన దురదృష్టకరం: జేపీ నడ్డా

ఈ ఘటన దురదృష్టకరమని రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈ ఘటనతో బీజేపీ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, దీనిపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి, కేబినెట్ మంత్రి ఖజన్ దాస్ మాట్లాడుతూ.. ఖర్గే సభలో కొన్ని నిర్దిష్టమైన నినాదాలు చేయడం వల్ల సనాతన ధర్మ భావాలు దెబ్బతిన్నాయని, అందుకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇది కులానికి సంబంధించిన అంశం కాదని, గతంలో కాంగ్రెస్ పార్టీయే సీతారాం కేసరి, బాబూ జగ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి దళిత నేతలను అవమానించిందని, ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.