ఖమ్మం టౌన్, వెలుగు : ఎమ్మెల్యే సీటు కోసం తమ కార్యకర్తల మనోభావాలను తాకట్టు పెట్టలేమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సీపీఐ జన చైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మంలో జడ్పీ సెంటర్ నుంచి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈసందర్భంగా కూనంనేని మాట్లాడుతూ తమ కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారని, అయినా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
గెలుపు, ఓటములు ఎన్నికల వరకే పరిమితమని, ఒకటి రెండు సీట్ల కోసం ప్రజా సమస్యల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పిరికివాడిగా మారారని, ఆయనకు ట్రంప్ ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రజల హక్కులు, సంక్షేమ పథకాలు కమ్యూనిస్టు పోరాట ఫలితంగానే వచ్చాయని, దేశంలో మార్పు సైతం కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
మోదీ, అమిత్ షా తప్పు చేశామన్న భావనతో ఉన్నారని, అందుకే పార్లమెంట్ వచ్చేందుకు భయపడుతున్నారన్నారు. జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు హేమంతరావు, రాష్ట్ర కంట్రోల్ కమీషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, నగర కార్యదర్శి షేక్ జానీమియా, రాష్ట్ర సమితి సభ్యులు ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్ పాల్గొన్నారు.
