‘సర్’ పేరిట సైబర్ మోసగాళ్ల వల...ఓటర్లే టార్గెట్‌‌‌‌గా ఈసీ అధికారులమంటూ వాట్సాప్‌‌‌‌ మెసేజ్‌‌‌‌లు

‘సర్’ పేరిట సైబర్ మోసగాళ్ల వల...ఓటర్లే టార్గెట్‌‌‌‌గా ఈసీ అధికారులమంటూ వాట్సాప్‌‌‌‌ మెసేజ్‌‌‌‌లు
  •     వివరాల సవరణ పేరుతో లింకులు రూ.5 చెల్లించాలంటూ సైబర్ వల
  •     బ్యాంకింగ్‌‌‌‌ వివరాలు, కార్డు, పిన్‌‌‌‌, ఓటీపీలు తస్కరించే యత్నం
  •     అప్రమత్తంగా ఉండాలంటూ టీజీసీఎస్‌‌‌‌బీ హెచ్చరిక

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఓటర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్‌‌‌‌ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ (స్పెషల్‌‌‌‌ ఇంటెన్సివ్‌‌‌‌ రివిజన్‌‌‌‌) ఫారం పేరుతో నకిలీ మెసేజ్​లు పంపుతూ ఓటర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్‌‌‌‌ వివరాలను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల పేరుతో వాట్సాప్‌‌‌‌, ఇతర డిజిటల్‌‌‌‌ వేదికల ద్వారా సందేశాలు పంపుతూ.. ఓటరు వివరాల్లో తప్పులున్నాయని, ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ఫారం తిరస్కరణకు గురైందని నమ్మిస్తున్నారు. అనంతరం వివరాలను సరిచేసుకోవాలంటూ హానికర లింకులు పంపి సైబర్‌‌‌‌ వలలోకి లాగుతున్నారు. ఇలాంటి మెసేజ్‌‌‌‌ల విషయంలో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌బీ) హెచ్చరించింది. ఈ మేరకు టీజీ సీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌ గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) పేరుతో ఓటర్లకు మోసపూరిత మెసేజ్​లు వస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి వచ్చినట్టు సీఈఓ కార్యాలయం సైతం మరో ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) లేదా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం ఎలాంటి మెసేజ్​లు పంపబోరని పేర్కొంది.  

రూ.5 చెల్లించాలంటూ కొత్త ఎత్తుగడ

సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఎన్నికల సంఘం అధికారులుగా పరిచయం చేసుకుంటూ ఓటర్లను సంప్రదిస్తున్నట్లు టీజీసీఎస్‌‌‌‌బీ తెలిపింది. ఓటరు వివరాలను అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయడం, ధ్రువీకరించడం లేదా ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ఫారం సవరణ కోసం రూ.5 వంటి స్వల్ప మొత్తాన్ని చెల్లించాలని కోరుతున్నారు. ఇందుకోసం వాట్సాప్‌‌‌‌ లేదా ఇతర సోషల్‌‌‌‌ మీడియా మాధ్యమాల్లో లింకులు పంపుతున్నారు. చిన్న మొత్తమే కదా అని బాధితులు లింక్‌‌‌‌పై క్లిక్‌‌‌‌ చేసేలా చేయడం నేరగాళ్ల వ్యూహంగా అధికారులు గుర్తించారు. లింక్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేసిన తర్వాత వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, కార్డు వివరాలు, పిన్‌‌‌‌, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయాలని కోరే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఒక్క క్లిక్‌‌‌‌తో ఖాతా ఖాళీ..

నకిలీ లింక్‌‌‌‌పై క్లిక్‌‌‌‌ చేయడం లేదా అందులో అడిగిన సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా బాధితులు తమ బ్యాంకింగ్‌‌‌‌ వివరాలను నేరగాళ్లకు తెలియజేసినట్లవుతుంది. ఆ వివరాలను ఉపయోగించి బ్యాంకు ఖాతాల్లోని నగదును దోచుకునే అవకాశం ఉంది. అందువల్ల ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ఫారం తిరస్కరణకు గురైంది. ‘ఓటరు వివరాలను వెంటనే అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయాలి’, ‘ధ్రువీకరణ కోసం చెల్లింపు చేయాలి’ అంటూ వచ్చే మెసేజ్​లను చూసి ఆందోళన చెందవద్దని టీజీసీఎస్‌‌‌‌బీ సూచించింది. ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ప్రక్రియ పూర్తిగా ఉచితం అని టీజీసీఎస్‌‌‌‌బీ స్పష్టం చేసింది. ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ లేదా ఓటరు వివరాల అప్‌‌‌‌డేట్‌‌‌‌, సవరణ, ధ్రువీకరణ పేరుతో ఎవరైనా డబ్బులు చెల్లించాలని కోరితే స్పందించవద్దని సూచించింది. బ్యాంకు లాగిన్‌‌‌‌ వివరాలు, కార్డు వివరాలు, పిన్‌‌‌‌, పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌లు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు షేర్​చేయవద్దని తెలిపింది. 

మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి..  

సైబర్‌‌‌‌ మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా 1930 సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేయాలని టీజీసీఎస్‌‌‌‌బీ అధికారులు సూచించారు. అదేవిధంగా నేషనల్‌‌‌‌ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ రిపోర్టింగ్‌‌‌‌ పోర్టల్‌‌‌‌ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే లావాదేవీలను నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.