మంచిర్యాల: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఆర్టీసీ వీలీన ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందర్భంగా బుధవారం (అక్టోబర్ 7) ఆర్టీసీ కార్మికులతో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU)ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
INTUC మద్దతుతోనే తెలంగాణ వర్కర్స్ యూనియన్ సమస్యలు తీరుతాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయంలో RTC కార్మికులు తమ సమస్యలు తీర్చాలంటూ ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ కుట్ర చేసి అణిచి వేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను సంస్థ నుంచి తొలగించి ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లను నియమించి కార్మిక వ్యతిరేక విధానాలకు తెర లేపారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు, హక్కుల కోసం పనిచేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు డీఏలు ఇవ్వడంతో పాటు మినిమం వేజెస్ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. RTC కార్మికులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం, 20 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. సింగరేణి సంస్థలో కార్మికులకు ఇస్తున్నట్లే ఆర్టీసీ కార్మికులకు కూడా ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
