న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లో 'కో–పేమెంట్' నిబంధనను తప్పనిసరి చేయడంపై ఇటీవల జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. ఈ విధానం అమల్లోకి వస్తే, పాలసీదారులకు వార్షిక ప్రీమియం తగ్గినప్పటికీ.. ఆసుపత్రిలో చేరి క్లెయిమ్ చేసుకునే సమయంలో బిల్లులో కొంత మొత్తాన్ని తమ సొంత జేబు నుంచే భరించాల్సి ఉంటుంది.
కో-పేమెంట్ అంటే..?
ఉదాహరణకు 10శాతం కో-పేమెంట్ నిబంధన ఉంటే.. ఆసుపత్రి బిల్లు రూ.5 లక్షలు అయినప్పుడు, బీమా సంస్థ రూ.4.5 లక్షలు చెల్లిస్తుంది, మిగిలిన రూ.50 వేలు పాలసీదారుడే చెల్లించాలి. ఒకవేళ బిల్లు రూ.25 లక్షలైతే, పాలసీదారుడు రూ.2.5 లక్షలు స్వయంగా భరించాల్సి వస్తుంది. ఈ కో–పేమెంట్ రూల్‌తో క్లెయిమ్ ఖర్చును కస్టమర్‌తో పంచుకోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీల రిస్క్ తగ్గి ప్రీమియం ధరలు తగ్గుతాయి. ఎక్కువ కవరేజ్ కోరుకునే వారికి ఇది అందుబాటు ధరలో లభిస్తుంది.
