- 18 ఏండ్ల కింద నాటి వాహనాలే దిక్కు
- అటకెక్కిన ఆత్మరక్షణ ఆయుధాల ఫైల్
- రిపేర్లకు సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటున్న అటవీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో హరిత సంపద, వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ రేంజ్ ఆఫీసర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రాణాలకు తెగించి స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి అడవిని రక్షించే ఫారెస్ట్ అధికారులకు కనీస వసతులు లేకపోవడం ఆ శాఖ దుస్థితికి అద్దం పడుతోంది.
క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ చేయడానికి సరైన వాహనాలు, అసాంఘిక శక్తులు దాడులు చేసినప్పుడు ఆత్మరక్షణ పొందేందుకు చేతిలో కనీసం ఆయుధాలు లేక ఆఫీసర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏండ్లుగా డొక్కు జీపులు, ఉత్త కర్రలతో విధులు నిర్వర్తించాల్సి వస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 250 అటవీ రేంజ్‌లు ఉండగా, 250 మంది రేంజ్ అధికారులు విధుల్లో కొనసాగుతున్నారు. సుదీర్ఘ అటవీ ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించాల్సిన వీరికి సరైన ప్రయాణ సదుపాయం కూడా లేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న వెహికల్స్‌ను దాదాపు 18 ఏండ్ల కింద అంటే 2006లో కొనుగోలు చేశారు. వీటి కాలపరిమితి ఎప్పుడో ముగిసినప్పటికీ, దట్టమైన అడవి మార్గాల్లో, గుట్టలు, రాళ్లురాప్పల్లో ఇప్పటికీ ఈ వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు.
దీంతో తరచూ రిపేర్లు వస్తున్నాయి. తరచూ బండ్లు మొరాయిస్తుండటంతో ఆఫీసర్లే వాటిని నెట్టాల్సి వస్తోంది. అంతేకాకుండా వాహనాల రిపేర్ల కోసం తమ సొంత జేబుల నుంచే ఖర్చు చేయాల్సి వస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్ అధికారులకు కొత్తవాహనాలు సమకూర్చడానికి కేవలం రూ.25 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని అంచనా వేసినా ప్రభుత్వం నిధుల విడుదల చేయడం లేదు.
రోజుకు 80 కిలోమీటర్ల ప్రయాణం..
ఒక్కోరేంజ్ పరిధి వేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. అక్రమ కలప రవాణా, పోడు భూముల ఆక్రమణలను నిరోధించేందుకు ఆఫీసర్లు రోజుకు సగటున 80 నుంచి 100 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. దట్టమైన అడవుల్లోని బీట్లను పర్యవేక్షించడానికి కాలం చెల్లిన జీపులు మరమ్మతులకు గురవుతుండటంతో ఆఫీసర్లు బైకులు లేదా కాలినడకన ప్రయాణిస్తున్నారు. రాత్రివేళల్లో వన్యప్రాణులు, స్మగ్లర్ల దాడులకు దారితీసే ప్రమాదముందని వారు
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటకెక్కిన ప్రతిపాదనలు..
అడవుల్లో కలప స్మగ్లర్లు, వేటగాళ్లు మారణాయుధాలతో దాడులు చేస్తుంటే రేంజ్ ఆఫీసర్లు మాత్రం కేవలం చేతికర్రలతో ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో అటవీ ఆఫీసర్లపై జరిగిన దాడుల నేపథ్యంలో వారికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాలనే ప్రతిపాదన చాలాకాలం నుంచి పెండింగ్‌లోనే ఉంది. ఇటీవల జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ సిబ్బందికి ఆయుధాలు సమకూర్చడానికి ఇతర వసతులు మెరుగుపరచడానికి సుమారు రూ.4,095 కోట్ల ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించారు.
కానీ, రక్షణ కోసం పిస్టల్స్, ఫీల్డ్ సిబ్బందికి రైఫిల్స్ కేటాయించాలనే ఫైల్‌కు ఇంకా మోక్షం లభించడం లేదు. అయితే, అటవిని రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అటవీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త వాహనాల కొనుగోలుకు తక్షణమే బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న ఆయుధాల ప్రతిపాదనను ఆమోదించాలని పేర్కొంటున్నారు.
