బీజేపీ ఓటును దొంగిలిస్తోంది..ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాలి

బీజేపీ ఓటును దొంగిలిస్తోంది..ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను  తొలగించాలి
  •     కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 
  •     సీఈసీ జ్ఞానేశ్​కుమార్ రాజీనామా చేయాలని ర్యాలీ, ధర్నా

కరీంనగర్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజలకు కల్పించిన ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ చోరీ చేస్తోందని, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సీఈసీ జ్ఞానేశ్​కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఫార్వార్డ్ బ్లాక్, న్యూమోక్రసీ, మాస్ లైన్ తదితర పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగ్ లోని ఇందిరా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఈసీ  జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్  బీజేపీకి యువమోర్చా, మహిళా మోర్చా లాగా ఒక అనుబంధ విభాగంగా మారిపోయిందన్నారు. ‘సర్’ ద్వారా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అణగారినవర్గాలు, నిరక్షరాస్యుల ఓట్లను తొలగించేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. 

కార్యక్రమంలో  మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,  సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి,- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, -సిటీ  కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆలిండియా- ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అంబటి జోజి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, వొడితల ప్రణవ్ బాబు, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి జిన్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.