తెలంగాణ రాజకీయ అస్థిత్వం, సంస్కృతి ఒక్కసారిగా ఆస్తుల చర్చవైపు మళ్లిందా. ఉద్యమం నుంచి అధికారం, అధికారం నుంచి సంపద. ఈ ప్రయాణం మీద ఇప్పుడు తెలంగాణ సమాజం లెక్క అడుగుతోంది. ఎవరిపాలైందీ తెలంగాణ, ‘లక్ష కోట్ల లెక్క తేలేదెప్పుడు?’ అనే ప్రశ్నలు కాస్త కఠినంగా, చేదుగానే ఉండవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో దీన్ని తప్పించుకోలేం.
ఒకప్పుడు ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ చుట్టూ తిరిగిన చర్చ ఇప్పుడు భూములు, ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, బినామీల చుట్టూ తిరుగుతోంది. రాజకీయ వేదికలపైనే కాదు, టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో, పల్లెల్లో, కల్లు మండువాల దగ్గర కూడా ఇదే మాట. తెచ్చుకున్న రాష్ట్రంలో ఇంతగా సంపాదించుకున్నారా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక కుటుంబం ఆస్తులు కూడబెట్టిందా? ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కూడా అదే బాటలో ఉన్నారా?’ అని జనం ఆలోచిస్తున్నారు.
ప్రాంతీయ అసమానతలు తొలగాలని, వనరులపై హక్కు రావాలని, ఉద్యోగాలు దక్కాలని ఉద్యమించిన నేల ఇది. అలాంటిచోట ‘ఎవరి దగ్గర ఎన్ని వందల ఎకరాలు? పదవికి ముందు ఎంత, పదేళ్ల తర్వాత ఎంత?’ అనే ప్రశ్నలు ప్రధాన చర్చగా మారితే, దాన్ని కేవలం ప్రత్యర్థుల ప్రచారమని కొట్టిపారేయడం సులభం కాదు. ఇది రాజకీయ మార్పు మాత్రమే కాదు. ఉద్యమ రాష్ట్రంలో అధికార రాజకీయాల స్వభావం ఎంతగా మారిందో చెప్పే పరిణామం.
రేవంత్ వ్యూహం..రాజకీయ ఎజండా సెట్ చేశారా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబ ఆస్తులు, ఎర్రవల్లి భూములు, ఫామ్‌హౌస్‌లు, కేటీఆర్ వ్యాపారాలపై వరుస ప్రశ్నలు లేవనెత్తారు. పైకి ఇవి రాజకీయ ఆరోపణలే. కానీ వ్యూహం కోణంలో చూస్తే ఇంకో పొర కనిపిస్తుంది. ఆయన బీఆర్‌ఎస్‌ను అత్యంత అసౌకర్యమైన మైదానంలోకి లాగారు.
బీఆర్‌ఎస్‌కు సహజమైన మైదానం తెలంగాణ సెంటిమెంట్. కేసీఆర్‌కు బలమైన రక్షణ కవచం ఉద్యమ చరిత్ర. రేవంత్ చర్చను అక్కడి నుంచి మార్చి ‘తెలంగాణ ఎలా వచ్చింది?’ ‘తెలంగాణ వచ్చాక ఎవరు ఎంత సంపాదించారు?’ అనే చర్చకు తెరలేపారు. ఇది రెండు విధాలుగా ప్రభావం చూపుతుంది.
మొదటిది, ఎజెండా నియంత్రణ. చర్చ ఏ అంశంపై జరగాలో నిర్ణయించే శక్తి రేవంత్ చేతికి వచ్చింది. రెండోది,భావోద్వేగ ప్రభావం. ఆరోపణ నిజమా, కాదా అని తేలకముందే, ప్రజల మనసులో ఒక పోలిక మొద లవుతుంది. రాష్ట్రం కోసం పోరాడిన సామాన్యుడి జీవితం ఎంత మారింది, రాష్ట్రాన్ని పాలించిన వారి ఆస్తులు ఎంత మారాయి? అనే సహజ చర్చ ఇప్పుడు జరుగుతున్నది.
బీఆర్‌ఎస్ వ్యూహాత్మక తప్పిదమా?
బీఆర్‌ఎస్, ముఖ్యంగా కేటీఆర్ ప్రతిస్పందనలో వ్యూహాత్మక లోపం కనిపిస్తున్నది. లక్ష కోట్ల ఆరోపణ వచ్చినప్పుడు లెక్కలు, పత్రాలతో సమాధానం. కుటుంబ ఆస్తుల జాబితా, ఎన్నికల అఫిడవిట్లు, కొనుగోలు తేదీలు, రిజిస్ట్రేషన్ విలువలు, ఆదాయ వనరులు సమగ్రంగా ప్రజల ముందుపెట్టి, ‘ఒక్క అక్రమ ఆస్తి నిరూపించండి’ అని సవాలు చేసి ఉంటే కథనం మరోలా ఉండేది.
కానీ ‘లక్ష కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తాం’, ‘రేవంత్ ఆస్తులూ విచారించాలి’, ‘సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి’ అనే ప్రతిస్పందనలు రాజకీయంగా ఆకర్షణీయంగా ఉన్నా అసలు ప్రశ్నను చెరపలేకపోయాయి. ‘మీ ఆస్తులెంత?’ అనే ప్రశ్నకు ‘వారి ఆస్తులెంత?’ అనేది సమాధానం కాదు. రేవంత్ కుటుంబ ఆస్తులపైనా విచారణ జరగాలనే డిమాండ్ న్యాయమైనదే. కానీ ప్రత్యారోపణ వల్ల తనపై వచ్చిన ప్రశ్నకు జవాబు చెప్పినట్టు కాదు.
చర్చను మరింత పెద్దది చేసిన బీఆర్ఎస్
కేటీఆర్ హోటళ్ల వ్యవహారంలోనూ ఇదే జరిగింది. తనకు వ్యాపార నేపథ్యం ఉందని, అమెరికాలో సంపాదించిన ఆదాయంతో వ్యాపారం ప్రారంభించానని, ఒక హోటల్ మూడు హోటళ్లుగా అభివృద్ధి చెందాయని కేటీఆర్ చెప్పిన వాదనతో రాజకీయంగా చర్చ ఆగలేదు. ‘
హోటళ్లు ఉన్నాయా?’ నుంచి ‘ఎన్ని? ఎప్పుడు కొన్నారు? పెట్టుబడి ఎంత? ప్రస్తుత విలువ ఎంత? యాజమాన్య నిర్మాణం ఏమిటి?’ అనే తదుపరి ప్రశ్నలకు అవకాశం ఇచ్చారు. ప్రత్యర్థి వేసిన ఉచ్చును ఛేదించాల్సిన చోట, బీఆర్‌ఎస్ ఆ చర్చను మరింత పెద్దది చేసుకుంది.
ఉద్యమ పార్టీకి ‘ఆస్తుల ప్రశ్న’ ప్రమాదకరమా?
సాధారణ పార్టీకి ఆస్తుల ఆరోపణ రాజకీయ వివాదం కావచ్చు. కాని ఉద్యమ పార్టీకి అది నైతిక పరీక్ష. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ ‘మేమూ అందరిలాంటివాళ్లమే’ అని చెప్పుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం, నిరుద్యోగుల ఆశ, రైతుల ఆకాంక్ష, విద్యార్థుల పోరాటం, ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉన్నాయి. ఎన్నో కుటుంబాల కన్నీరు ఉంది. అందుకే ఆ ఉద్యమ నాయకత్వాన్ని ప్రజలు ప్రశ్నించడం సహజం.
తెలంగాణ ఎవరిపాలైంది?
ఉమ్మడి రాష్ట్రంలో వనరులు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయని, భూములు ఎవరి వద్ద ఉన్నాయని, నీళ్లు ఎవరు తీసుకెళ్తున్నారని ప్రశ్నించింది ఈ సమాజమే. మరి రాష్ట్రం వచ్చాక అధికారం ఎవరి చేతుల్లో కేంద్రీకృతమైంది, సంపద ఎవరి వద్ద పెరిగింది, భూముల యాజమాన్యం ఎలా మారిందని అడగడం ఎలా తప్పవుతుంది? ‘తెలంగాణ ఎవరి పాలైంది?’ అని అడగడం తెలంగాణను అవమానించడం కాదు, ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేయడమే.
ప్రశ్నించడం ఉద్యమ ద్రోహం కాదు. ప్రశ్నించనివ్వకపోవడమే ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం. అయితే ఈ ప్రమాణం అందరికీ వర్తించాలి. నేడు రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు. రేపు ప్రజలు ఆయన కుటుంబ ఆస్తుల గురించి అడిగితే ఆయనా పూర్తి వివరాలు చెప్పాల్సిందే. లేకపోతే ఇది అవినీతిపై పోరాటంగాకాక, ఆస్తుల రాజకీయ ప్రతీకారంగా మిగిలిపోతుంది.
వ్యక్తుల యుద్ధం కాదు, వ్యవస్థకు ప్రమాణం
ఈ చర్చను వ్యక్తుల మధ్య యుద్ధంగా ముగించకూడదు. దీన్ని ఒక కొత్త ప్రజాస్వామ్య ప్రమాణంగా మార్చాలి. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా పదవిలోకి వచ్చేటప్పుడు ఆస్తులెంత, పదవి ముగిసే నాటికి ఎంత, పెరుగుదలకు ఆదాయ వనరు ఏమిటి అనే వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
ఇవి పార్టీలకు అతీతంగా క్రమం తప్పకుండా వెల్లడయ్యే వ్యవస్థ ఉన్నప్పుడే ‘తెలంగాణ ఎవరి పాలైంది?’ అనే ప్రశ్నకు నిజమైన సమాధానం దొరుకుతుంది. రేవంత్ వేసిన ఉచ్చులో బీఆర్‌ఎస్ పడిందో లేదో కాలం తేలుస్తుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పుడు ఎవరినీ వదలదు.
‘లక్ష కోట్ల లెక్క’ ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. ‘తెలంగాణ ఎవరి పాలైంది?’ అనే లెక్క మాత్రం తెలంగాణ సమాజం మొత్తానిది.
- వెంకట్ గుంటిపల్లి,సీనియర్ జర్నలిస్ట్ ,తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
