బంగారం, వెండి దిగుమతులపై జీఎస్టీ పిడుగు: 3% ఐజీఎస్టీ మినహాయింపు రద్దుకు ప్లాన్!

బంగారం, వెండి దిగుమతులపై జీఎస్టీ పిడుగు: 3% ఐజీఎస్టీ మినహాయింపు రద్దుకు ప్లాన్!

బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై ఇప్పటివరకు ఉన్న ఐజీఎస్టీ(IGST) మినహాయింపును ఎత్తివేయాలని జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసింది. ఈ నిర్ణయం అమలైతే బ్యాంకులు, నోటిఫైడ్ ఏజెన్సీలు చేసే ఈ విలువైన లోహాల దిగుమతులపై నేరుగా 3 శాతం ఐజీఎస్టీ పడనుంది. దేశంలో పెరుగుతున్న దిగుమతులు, ట్యాక్స్ విధానంలో స్పష్టత కోసం ఈ చర్యకు రంగం సిద్ధమైంది.

వ్యాపారులకు 2017లో మొదట బంగారం దిగుమతుల కోసం ఈ జీఎస్టీ మినహాయింపును తీసుకొచ్చారు. ఆ తర్వాత దీనిని వెండి, ప్లాటినం దిగుమతులకు కూడా పొడిగించారు. అయితే డీజీఎఫ్‌టీ జారీ చేసిన అర్హత గల బ్యాంకుల జాబితాకు, జీఎస్టీ మినహాయింపు నోటిఫికేషన్‌కు మధ్య పొంతన కుదరకపోవడంతో ఈ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకు వర్తించే దిగుమతి జాబితా గడువు మార్చి 2026తో ముగిసింది. ఆ తర్వాత డీజీఎఫ్‌టీ కొత్త జాబితాను విడుదల చేసినప్పటికీ.. జీఎస్టీ మినహాయింపు నోటిఫికేషన్ అప్‌డేట్ కాలేదు. దీంతో ఏప్రిల్ 2026 నుంచి బ్యాంట్లకు ఈ మినహాయింపు అందడం లేదు. ఈ నేపథ్యంలోనే గందరగోళానికి తెరదించుతూ బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలన్నింటికీ ఐజీఎస్టీ మినహాయింపును పూర్తిగా రద్దు చేయాలని కమిటీ స్పష్టం చేసింది.

అయితే ఈ పన్ను విధింపు వల్ల దిగుమతిదారులపై భారం మోయరాని విధంగా ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. దిగుమతిదారులు తాము చెల్లించిన ఐజీఎస్టీపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఫిట్మెంట్ కమిటీ స్పష్టం చేసింది. దీనివల్ల ఫైనల్ పన్ను భారం పెద్దగా మారకపోవచ్చని నిపుణులు అంచనా.

ALSO READ : జేపీ మోర్గాన్‌లో జాబ్ పోయినా కుంగిపోలే..

దీంతో పాటు ఎక్స్‌పోర్ట్-లింక్డ్ సప్లై స్కీమ్ కింద నామినేటెడ్ ఏజెన్సీలు చేసే బంగారు సరఫరాలకు సంబంధించిన జీఎస్టీ నిబంధనల్లో తగిన సవరణలు చేయాలని కమిటీ సూచించింది. డీజీఎఫ్‌టీ హ్యాండ్‌బుక్ ప్రకారం నామినేటెడ్ ఏజెన్సీల నిర్వచనాన్ని స్పష్టం చేయాలని ప్రతిపాదించింది. త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.