జేపీ మోర్గాన్‌లో జాబ్ పోయినా కుంగిపోలే.. లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చిన టెక్కీ ఏం చేశాడంటే?

జేపీ మోర్గాన్‌లో జాబ్ పోయినా కుంగిపోలే.. లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చిన టెక్కీ ఏం చేశాడంటే?

విదేశాల్లో లక్షల్లో జీతం, ఊహించని విధంగా వచ్చిన లేఆఫ్.. ఒక్క రాత్రిలో తలకిందులైన కెరీర్. ఇదీ నేటి టెక్ ప్రపంచంలో చాలా మంది ఇంజనీర్ల పరిస్థితి. అయితే ఉద్యోగం ఊడిందన్న నిరాశలో కూరుకుపోకుండా.. స్వగ్రామానికి వచ్చి కుటుంబంతో కాలం గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఒక భారతీయ టెక్కీ. జేపీ మోర్గాన్ కంపెనీలో డేటా ఇంజనీర్‌గా పనిచేసి ఉద్యోగం కోల్పోయిన కైష్ అన్సారీ రియల్ లైఫ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

యూకేలోని గ్లాస్గోలో జేపీ మోర్గాన్ సంస్థలో డేటా ఇంజనీర్‌గా పనిచేస్తున్న కైష్ అన్సారీ.. రెండేళ్లకు పైగా అక్కడే గడిపారు. అయితే కంపెనీలో జరిగిన లేఆఫ్స్‌లో భాగంగా రెండ్రోజుల క్రితం జాబ్ కోల్పోవాల్సి వచ్చింది. దాంతో విదేశాల్లో ఉండలేక.. ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామమైన గోరఖ్‌పూర్‌కు తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతూ.. కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నారు.

ఈ విషయాన్ని కైష్ అన్సారీ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్నారు. తన స్వగ్రామంలో స్థానిక చిన్నారులతో సరదాగా గడుపుతున్న ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు రావడం, పోవడం సహజం. కొత్త ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి నేను నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను" అని ఎంతో పాజిటివ్‌గా స్పందించారు. ఈయన చూపిన ధైర్యం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం కొత్త జాబ్ హంట్‌లో ఉన్న కైష్ అన్సారీ.. ఇప్పటికే పలు కంపెనీలకు ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, ఒకటి రెండు వారాల్లో మంచి శుభవార్త వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిన్న ఊరి నుంచి వచ్చి పెద్ద కలలు కనే ప్రతీ ఒక్కరికీ నీ పట్టుదల స్ఫూర్తిదాయకమంటూ కామెంట్లు పెడుతున్నారు.

ALSO READ  : అమెరికా ఉపాధ్యక్షుడి భార్య బిడ్డతో హెలికాఫ్టర్ దిగుతూ కిందపడబోతే ఒక్కరు పట్టించుకోలే..!

ఉద్యోగం పోయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చని కైష్ అన్సారీ నిరూపించారు. లేఆఫ్స్ టెన్షన్‌తో సతమతమవుతున్న నేటి టెక్కీలకు ఈ రియల్ లైఫ్ జర్నీ ఒక చక్కటి సందేశాన్ని ఇస్తోంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏ కష్టాన్నైనా సులువుగా జయించవచ్చని ఈ టెక్కీ ఆచరణలో నిరూపించి చూపించారు.