బి. నర్సింగరావు గురించి మాట్లాడుకోవడం అంటే 60 ఏళ్లకు పైబడిన తెలంగాణ సాంస్కృతిక జీవన పరిణామాన్ని, దాని వికాసాన్ని గురించి మాట్లాడుకోవడమే అవుతుంది. వర్తమానంలో ఆయన చాలామందికి సినిమా దర్శకుడిగానే తెలుసు, కానీ ఆయన కవి, కథా రచయిత, గొప్ప చిత్రకారుడు కూడా. ఈ మూడింటి సమ్మేళనం తర్వాత ఆయన చలనచిత్రకారుడిగా ఆవిర్భవించారు. ఆయన ఎప్పుడూ ప్రజలు, ప్రజాకళలు, ప్రజాకవులతో కలిసి మమేకమై జీవించారు.
ఎమర్జెన్సీ తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల జీవనంలో వచ్చిన మార్పును, సంఘర్షణను, సమాజంలో ఉన్న అంతర్మథనాన్ని అర్థం చేసుకుని ఒక చలనచిత్రకారుడిగా పరిణామం చెందాడు. ‘తెలంగాణ సినిమా’ అన్న మాటకు అక్కడే అంకురార్పణ జరిగింది. 1979లో ఆయన తీసిన 'మా భూమి' సినిమా నేటికీ ప్రజాకళల్లో అంతర్భాగంగా కొనసాగుతోంది.
‘మా భూమి'కి దర్శకుడు గౌతమ్ ఘోష్ అయినా ఆ సినిమా రూపకల్పనలో కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా బి. నర్సింగరావే. కథతో మొదలుకొని సంగీతంతో సహా ఆ సినిమా అంతటికి అన్నీ తానే అయి మా భూమి సినిమాని నిర్మించాడు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సెల్యులాయిడ్ రూపం 'మా భూమి'
'మా భూమి' 1948నాటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సెల్యులాయిడ్ రూపం. ఆ తర్వాత ఆయన తీసిన చిత్రం 'రంగుల కల'. ఈ సినిమాలో తన వ్యక్తిగత జీవితంలోని అభిరుచిని, ఒక సామాజిక బాధ్యతగల చిత్రకారుడిలో ఉద్వేగాన్ని, ఒక ఎమోషన్ని ఆయన చూపించారు. ఒక థియేటర్‌లో అంటే అంత పెద్ద క్యాన్వాస్‌పై 24 ఫ్రేములలో కదిలిపోయే కొన్ని లక్షల చిత్రాలుగా చూపించిన గొప్ప సినిమా 'రంగుల కల'.
ఈ సినిమా హైదరాబాద్ ప్రజల నగర జీవన శైలికి, పాటలు, జీవితం, ఓ చిత్రకారుడి అంతర్మథనానికి చలనచిత్ర రూపంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత తీసిన 'దాసి' తెలంగాణ సమాజంలో 1950కి ముందు ఫ్యూడల్ వ్యవస్థలో స్త్రీల జీవితం ఎట్లా ఉండేది, స్త్రీని ఒక భోగపు వస్తువుగా ఎట్లా పరిగణించేవారో తెలిసేలా నర్సింగరావు 'దాసి' చిత్రంలో కమల పాత్రను చూపించిన తీరు ఒక గొప్ప ప్రయోగం. 'దాసి' సినిమాకు జాతీయ అవార్డులతోపాటు దేశ దేశాల్లో ఫిలిం ఫెస్టివల్స్ కూడా ' బ్రహ్మరథం పట్టాయి.
అడ్డా కూలీల జీవిత ప్రతిబింబం మట్టి మనుషులు
నర్సింగరావు తీసిన మరో సినిమా 'మట్టి మనుషులు'. ఈ చిత్రంలో పాలమూరు జిల్లా అడ్డా కూలీలు ఎంత దుర్భరమైన జీవితాలు జీవిస్తారో, ఎన్ని రకాల కష్టాలకు గురవుతారో ఆయన మనకు చూపించారు. 'మట్టి మనుషులు'లో కూలీగా నటించిన అర్చన నటన అనితర సాధ్యం. బి నర్సింగరావు బాలల మానసిక విశ్లేషణకు అద్దం పట్టిన సినిమా 'హరివిల్లు'. ఒకరకంగా ఒక సాధారణ బాలిక, ఉన్నత వర్గానికి చెందిన బాలుడు మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్ ని ఆయన చూపిన విధానం మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
నర్సింగరావు 'హరివిల్లు' తీసినా, 'దాసి' తీసినా, లేకపోతే 'మట్టి మనుషులు' తీసినా, 'రంగుల కల' తీసినా... ఆ సినిమాల్లో ఆయన విభిన్న ఆలోచనల ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అదే బి.ఎన్. సినిమాల ప్రత్యేకత. ఇంకా ఆయన 'ది సిటీ', 'మా ఊరు', 'ఆకృతి' వంటి డాక్యుమెంటరీలను కూడా తీసి చారిత్రక డాక్యుమెంటేషన్‌ను మనకు అందజేశారు.
భారత ప్రభుత్వం సముచితంగా గౌరవించాలి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు సత్యజిత్ రే మరణించినప్పుడు.. ‘సత్యజిత్ రే తర్వాత ఎవరు?’ అన్న శీర్షికతో మణికౌల్ రాసిన ఒక వ్యాసంలో ‘సత్యజిత్ రే వారసులు ఇద్దరే కనపడతారు. ఒకరు శ్యామ్ బెనెగల్, మరొకరు బి.నర్సింగరావు’ అని పేర్కొన్నారు.
సత్యజిత్ రేతో బి నర్సింగరావును సరిపోల్చుతూ ‘సత్యజిత్ రేలాగ బి.ఎన్. కవి, కథకుడు, చిత్రకారుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా కావడం యాదృచ్ఛికమే అయినా, ఆయనకు వారసుడిగా బి నర్సింగరావును చెప్పుకోవచ్చు’ అని ప్రస్తుతించాడు. మన కాలపు లెజెండ్‌గా బి. నర్సింగరావు అందుకున్న పురస్కారాలు, అవార్డులు లెక్కలేనన్ని.
ఆయనకు నేడు అంబేద్కర్ వర్సిటీ డి.లిట్ ఇవ్వడం తెలంగాణ సమాజం అంతటా కూడా హర్షించదగిన విషయం. బి నర్సింగరావు తెలంగాణ సాంస్కృతిక రంగానికి చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారాలతో సముచితంగా గౌరవిస్తుందని ఆశిద్దాం.
హెచ్. రమేష్ బాబు ,తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీత
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
