వెలుగు స్పెషల్ : ధనికస్వామ్యం నుంచి బయటపడేదెలా?

వెలుగు స్పెషల్ : ధనికస్వామ్యం నుంచి  బయటపడేదెలా?

భారత మేధావులు వలస దోపిడీ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి జాతీయవాదాన్ని ఒక సిద్ధాంతంగా, రాజకీయంగా తీర్చిదిద్దారు. ఇక్కడే ఆధునిక రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వయోజన ఓటు హక్కుతో కూడిన ఎన్నికల వ్యవస్థ ఆధారంగా  ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి వారు అన్ని వర్గాలను ఏకంచేశారు. 

భారతదేశాన్ని ఒక దేశంగా తీర్చిదిద్దడానికి కుల నిర్మూలనకు నిబంధనలు కల్పించిన రాజ్యాంగాన్ని రూపొందించినందుకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అది  ‘న్యాయం’ ఆధారంగా ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలని ఆకాంక్షించింది. భారత ప్రజలు ఈ మార్పును తమదిగా స్వీకరించి, ఎన్నికలలో చురుకైన భాగస్వాములుగా మారారు, తద్వారా 1952లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఆవిర్భవించింది.   

క్రమంగా  ప్రాచీన సంబంధాల ఆధారంగా నిమ్న కులాల మద్దతును కూడగట్టడానికి కులాల ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించడం జరిగింది.  అనంతరం అగ్రవర్ణ నాయకులు ప్రావిన్సులలోని ఆధిపత్య కులాల ఆధారంగా పార్టీలను నిర్మించారు. చివరికి ప్రైవేటీకరణ విధానం ద్వారా సంపదను 
సృష్టించడం జరిగింది.  సమాజంలో  కేవలం  అత్యంత ధనవంతులైన కొద్దిమంది చేతుల్లోనే రాజకీయ అధికారం కేంద్రీకృతమవడాన్ని ప్లూటోక్రసీ ( ధనికస్వామ్యం) అంటారు.

రష్యన్ విప్లవం విజయం తర్వాత సామ్యవాద భావన కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అది భారతదేశంలోని ప్రజలను కూడా ప్రభావితం చేసింది. రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ1950వ దశకంలో కాంగ్రెస్‌‌‌‌కు,  రాజ్యాంగానికి  ప్రత్యామ్నాయంగా సోషలిస్ట్ పార్టీలు, కమ్యూనిస్టులు పుట్టారు.  కానీ వారు ఆశించినట్లుగా నెహ్రూ ప్రభుత్వాన్ని కూలదోయలేకపోయారు. 

బ్రిటిష్ వారిని, భూస్వామ్య వ్యవస్థను తరిమికొట్టడానికి  రైతులు ఒక విప్లవ శక్తి అని చెప్పుకున్నారు.  అయినప్పటికీ వారు ఒక సాంస్కృతిక, నైతిక శక్తిగానే మిగిలిపోయారుకానీ రాజకీయ శక్తిగా కాదు. అందువల్ల కమ్యూనిస్టులు గాంధీలాగ భారతీయ వాస్తవికతను అంచనా వేయలేకపోయారు.

సోషలిజాన్ని విశ్వసించిన నెహ్రూ

ఎన్నికల వ్యవస్థకు కులం తప్పనిసరి అయినప్పుడు నెహ్రూ సోషలిజాన్ని విశ్వసించారు, ఆయన ఆధిపత్య కులాలపై ఆధారపడ్డారు. ఆ విధంగా, ఎన్నికలలో పార్టీని విజయవంతం చేయడానికి ఆయన ఆచరణాత్మకంగా వ్యవహరించారు.  

భూస్వాములు,  ఆధిపత్య కులాలు ప్రజాస్వామ్యాన్ని తమ అవసరాల వైపు మళ్లించారు. ఈవిధంగా, ఎన్నికల వ్యవస్థను విజయవంతం చేయడానికి అవసరమైన  ఆ  కులశ్రేణి ద్వారా భారతదేశం చివరికి కులపిచ్చిగా తయారైంది. సరళీకరణ తర్వాత సంపద పోగుపడింది, తద్వారా ప్రజాస్వామ్యం స్థానంలో ధనికస్వామ్యం (ఫ్లూటోక్రసీ) ఏర్పడింది.   

తరచుగా నిమ్న కులాల వారు  గ్రామస్థాయిలో  తమ సత్తా  చాటుకోవలసి రాగా,  పట్టణ  దళితులు ప్రత్యామ్నాయంగా అంబేద్కర్‌‌‌‌ను రంగంలోకి దించి, అంతిమంగా సామాజిక న్యాయం వైపు పయనించాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన రాజకీయ న్యాయాన్ని స్థాపించడంలోనే వారికి పరిష్కారం ఉందని  భావించారు. కానీ, తమ సొంత అధికార వ్యవస్థను స్థాపించుకోవడానికి పార్లమెంట్ సభ్యులుగా మారవలసి వచ్చిన  ధనికవర్గానికి కులం అనేది ఒక అవసరమైన పునాదిగా మారింది.

కమ్యూనిస్టులు

కమ్యూనిస్టులు తమ గత బలాన్ని ప్రదర్శించి ఒకటి రెండు సీట్లు గెలుచుకోవాలనే ఆశతో ఎన్నికల పొత్తు కోసం ఎదురుచూస్తూ ‘ఫ్లూటోక్రసీ’ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. కానీ ధనవంతులకు వారి బలం గురించి బాగా తెలుసు.  అయినప్పటికీ, అన్నివర్గాల కమ్యూనిస్టులు సామాజిక న్యాయ నినాదాలను ఉపయోగించడానికి ఇష్టపడలేదు. వారు లెనినిజం, మార్క్సిజం  వాక్చాతుర్యం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ దాని అర్థాన్ని నిర్వచించలేదు. 

పరివర్తన కాలంలో నెహ్రూ విజయం సాధించడానికి గల కారణాలను కమ్యూనిస్టులు విశ్లేషించలేదు. వలస పాలకులకు లొంగి ఉండటం వల్ల ఏర్పడిన పాక్షిక- భూస్వామ్య పునాది, పాక్షిక- వలసవాద ప్రభావం కారణంగానే నెహ్రూ విజయం సాధ్యమైందని వారు భావించారు. 

వాస్తవానికి అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఒకే విధంగా ఉంటాయి.  కానీ ఎన్నికల వైఫల్యాలు, వ్యక్తిగత విభేదాలు,  వర్గాలను నడిపించే వర్గ ప్రయోజనాల కారణంగానే చీలికలు ఏర్పడ్డాయి. అసెంబ్లీలో తమ ఉనికిని నిరూపించుకోవడానికి ఒకటి రెండు సీట్లు గెలుచుకునేందుకు అనుసరించిన పార్టీ నిర్మాణం, వ్యూహం ఒకే విధంగా ఉండేవి. అయితే, అప్పటికే  కనుమరుగవుతున్న తమ  కార్యకర్తల మద్దతును వారు నిలుపుకోవలసి వచ్చింది. తాము ఇంకా ఒక పార్టీగానే ఉన్నామని నిరూపించుకోవడానికి వారు ఇటీవల గొప్ప సమావేశాలు ప్రారంభించారు. 

ఈ శతాబ్దంలో భారతదేశం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, అది ఎలా ధనికస్వామ్యంగా మారింది అనే దానిపై ఒక సైద్ధాంతిక గ్రంథం రావాలి.  వైఫల్యాల తర్వాత వారిలో కొందరు కమ్యూనిస్టులంతా ఏకం కావాలని కోరుకున్నారు.  
         
 ఐక్యతకు ఆధారం ఏమిటి?

ఐక్యతకు సైద్ధాంతిక ఆధారం ఏదీ లేదు. వారు మళ్లీ ఇటీవల ఫాసిజం అనే ఒక ఘోస్ట్‌‌‌‌ను కనుగొన్నారు.   రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో భారతదేశంలో ఈ ఫాసిజం అనే భావనకు  వ్యవస్థాపకుడు నెహ్రూనే.  జాతీయ రాజకీయ వర్గం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ,  ఫాసిస్ట్  దురాక్రమణ 
రాజకీయాలను వ్యతిరేకించింది. అటువంటి దురాక్రమణను విడనాడమని గాంధీ హిట్లర్‌‌‌‌కు లేఖ రాశారు.  

నెహ్రూ ఈ భావనను ఉపయోగించి హిందూ మహాసభను, ఆ తర్వాత జనసంఘ్‌‌‌‌ను భారతీయ ఫాసిస్టులుగా చిత్రీకరించి ఏకాకిని చేశారు. వారు అన్ని పార్టీలకు వ్యతిరేకంగా హిందూ మతతత్వాన్ని ఉపయోగించుకున్నారు.  నెహ్రూ నెమ్మదిగా భూ సంస్కరణలు,  వ్యవసాయంలో  రైతాంగ ఆమోదం వంటి వామపక్ష కార్యక్రమాలను చేపట్టి 1960ల నాటికి అమలుచేశారు.

 మూడో సార్వత్రిక ఎన్నికల నాటికి, బ్రాహ్మణ ప్రాంతీయ నాయకత్వాన్ని తొలగించి, దక్షిణ భారతదేశంలోని శూద్రులు (అనగా రైతాంగ కులాలు), ఉత్తర భారతదేశంలోని ఖత్రియాలకు అధికారం కల్పించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థకు కులమే ఆధారం అయింది. 1970ల నాటికి కమ్యూనిస్టుల రైతాంగ బలం క్షీణించింది. ఇందిరా గాంధీకి మితవాదులు తప్ప వేరే  ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. 

బలపడిన ధనికస్వామ్యం

ప్రజాస్వామ్యంలో అగ్రవర్ణాల ఆధిపత్య అనుభవం ఉన్న ఈ దేశ ప్రజలు అంబేద్కర్‌‌‌‌ను చర్చలోకి తీసుకువచ్చారు.  ఇటీవల రాజ్యాంగ పీఠికలో ఉన్న సాంఘిక న్యాయం ప్రజా చర్చనీయాంశంగా మారింది. బీసీ, ఎస్సీ వర్గాలు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ చురుకుగా మారాయి.

 ప్రాథమికంగా, వారు ఒకటి రెండు సీట్లు పొందడానికి అధికార పార్టీల దృష్టిని కర్షించాలనుకుంటున్నారు. అయితే వారు అంబేద్కర్ స్థాయి మరో  నాయకుడిని తయారు చేయలేదు. అధికార పార్టీలు పోగుచేసిన సంపదతోపాటు కొన్ని ఉచితాలు ఇస్తామని ఆశచూపి వారిని ప్రలోభపెట్టాయి.  

రాజకీయ  అధికారంలో  వాటా  ఆశిస్తూ  అధికారంలో  ఉన్నవారికి లొంగి ఉండటం  ద్వారా ధనికస్వామ్యం బలపడింది. అందువల్ల  ప్రస్తుతం అధికార పార్టీలకు  దీటైన ప్రతిపక్షం లేదు. ఏ అగ్రవర్ణ నాయకుడు అయినా తమపై ఆధారపడిన కులాలను అణచిపెట్టి తమ కులాన్ని సమీకరించుకోగలడు.  అధికారంలోకి వచ్చాక  వారు భూములు,  పట్టణ ఆస్తుల రూపంలో ఉన్న సంపదను స్వార్జితం చేసుకుంటారు.  

గతంలో  వారు ఆస్తులను వాణిజ్యీకరించారు, మాల్స్,   పరిశ్రమలు,  ప్రభుత్వ కాంట్రాక్టులు ఏర్పాటు చేశారు. నేడు పార్టీలు నాయకులకు అనుకూలంగా రెవెన్యూ చట్టాలను మార్చి భూములను కాజేశారు. అక్రమార్జన ఆశచూపి రిజిస్ట్రార్లను, తహసీల్ అధికారులను,   కిందిస్థాయి పోలీసులను అవినీతిపరులుగా మార్చారు.  అక్రమ సంపాదన కూడబెట్టిన ప్రభుత్వ అధికారులు ఎలా జైళ్లకు వెళుతున్నారో  మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రజాస్వామ్యం ధనవంతుల చేతిలో కీలుబొమ్మలా తయారైంది.

దేశసంపద దోపిడీపై  ప్రజల ఆందోళన

ఎస్సీ, బీసీ  మేధావులు ఈ దిగజారిన ప్రజాస్వామ్య  ప్రక్రియను అర్థం చేసుకున్నారు.  అయితే మంత్రులుగా,  ఎమ్మెల్యేలుగా అధికారంలో  వాటా  పొందడానికే వారు ఈ సమస్యలను లేవనెత్తుతున్నారు.  ఈనేపథ్యంలో వారిలో కొందరిని పార్టీ అధిపతులుగా,  మంత్రులుగా  చేశారన్నది వాస్తవం, కానీ అధికారం మాత్రం బదిలీ కాలేదు. వారు ఇప్పటికే ఉన్న ధనికస్వామ్యానికి ప్రత్యామ్నాయంగా మారడం లేదు.  

మంత్రులైతే పదవితో సంపదను కూడబెట్టుకోవచ్చని వారు కూడా ఆశిస్తున్నారు. కానీ వారు ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని భావించడంలేదు. న్యాయం ఆధారంగా ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి వారు రాజ్యాంగాన్ని తిరిగి తీసుకురావాలి.  ఇటీవల వామపక్ష పార్టీలు తామే ఫాసిజానికి వ్యతిరేకంగా అసలైన సిద్ధాంతకర్తలమని  చెప్పుకుంటున్నాయి. 

 ప్రజలు అంటే ఓటర్లు లౌకికవాదానికి ఓటు వేస్తున్నారా? వారు ఫాసిజానికి వ్యతిరేకులా? నాయకులు సంపదను దోచుకోవడంపై ఈ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  నాయకులను దూషిస్తున్నారు.  ఎన్నికల ప్రజాస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలు తమకు లభించలేదని గ్రహించారు. వారి పిల్లలు గౌరవప్రదమైన ఉద్యోగాలలో స్థిరపడలేదు. అధికారంలోకి రాగల ప్రధాన ప్రతిపక్ష పార్టీని తీసుకురావడం ద్వారా ఓటర్లు అధికార పార్టీని మారుస్తున్నారు.  కేవలం అధికార పార్టీకి గుణపాఠం నేర్పుతున్నారు.
 
ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలంటే  కుల పార్టీలను వ్యతిరేకించాలి

ప్రతిపక్ష పార్టీ కూడా  అధికార పార్టీలాగా ఉంటుందని  ప్రజలకు బాగా తెలుసు.  తెలంగాణలో  కాంగ్రెస్  గతంలో ఎలా ఉండేదో  ప్రజలకు తెలిసినా.. గత అధికార పార్టీని గద్దె దించాలనే ఉద్దేశంతోనే దాన్ని తిరిగి తీసుకువచ్చారు.  ప్రజల దృష్టిలో అధికారం  చేపట్టగల స్థితిలో  వామపక్ష పార్టీలు ఉన్నాయా అంటే లేవు అనే సమాధానం వస్తుంది.

 అంతిమంగా ఆధిపత్య వర్గాలే అధికారాన్ని అనుభవిస్తున్నాయి. పలు కారణాలరీత్యా  కమ్యూనిస్టులు అధికార పార్టీలకు  తొత్తులుగా మారారు.  ఈవిధంగా, వివిధ ఆధిపత్య కులాల మధ్య ధనికస్వామ్యం చిక్కుకుంది.  ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలంటే  కుల పార్టీలను వ్యతిరేకించాలి.

  ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సామాజిక న్యాయం అనేది మేధావులు ముందుకు తీసుకువెళ్లాల్సిన  ఏకైక పరిష్కారం.  ఆధిపత్య  కుల పార్టీలను కాకుండా  వామపక్ష పార్టీలు వారిని అనుసరించాలి.  ధనికస్వామ్యం నుంచి బయటపడి,  పెరుగుతున్న ప్రజాస్వామ్య అశాంతికి  నాయకత్వం వహించాలి. అంతిమంగా  ఫ్లూటోక్రసీ  కబంధ  హస్తాల నుంచి  దేశాన్ని  విడిపించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. 


 ప్రొ. ఇనుకొండ తిరుమలి,ప్రజా చరిత్రకారుడు
 
గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.