గచ్చిబౌలి, వెలుగు: షాదీ.కామ్లో పరిచయమైన ఓ యువతి క్రిప్టో ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని, లాభాలు వస్తాయని నమ్మించి ఓ సాఫ్ట్వేర్యువకుడిని నిలువునా దోచుకుంది. రూ.10.50 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేసింది.
పుప్పాలగూడ రాఘవేంద్రకాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ నెల 8న షాదీ.కామ్లో వైష్ణవి అనే యువతి పరిచయమైంది. ఇద్దరూ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. బుట్టలో పడ్డాడని గుర్తించిన వైష్ణవి ‘నేను క్రిప్టో ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టా..నువ్వు కూడా పెట్టు’ అని కోరింది.
ఒప్పుకోవడంతో ఓ వెబ్సైట్అడ్రస్ఇచ్చింది. ‘అది ఫేక్ వెబ్సైట్. నువ్వు కూడా మోసపోతావ్వద్దు’ అని ఆమెకు సలహా ఇచ్చాడు. కానీ, వైష్ణవి అతన్ని నమ్మించి మొదట రూ.50వేలు పెట్టించింది. అతడికి రూ.20 వేలు ప్రాఫిట్వచ్చాయి. తర్వాత లక్షల్లో పెట్టాలని కోరడంతో బ్యాంక్లోన్తీసుకొని మరీ రూ.10 లక్షలు పెట్టాడు.
దీంతో రూ.3 లక్షలు లాభం వచ్చినట్లు వెబ్సైట్లో కనిపించింది. తర్వాత తన ఫ్రెండ్‌కు హెల్త్ప్రాబ్లం ఉందని రూ. 2 లక్షలు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా కాలేదు. ఈ విషయం వైష్ణవికి చెప్పగా, ‘డబ్బులు ఎందుకు తీసుకోవడం.. ఇంకొన్ని లక్షలు పెట్టు’ అని కోరింది.
అతను ఒప్పుకోకపోవడంతో వాట్సప్‌కాల్స్, గూగుల్ మీట్స్‌కు స్పందించడం మానేసింది. డబ్బులు తీసుకుందామంటే విత్‌డ్రా కాలేదు. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
