బేసిన్ ప్రామాణికం కాదు.. వినియోగమే..కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు

బేసిన్ ప్రామాణికం కాదు.. వినియోగమే..కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
  • కృష్ణా ట్రిబ్యునల్​ ముందు ఏపీ వాదనలు
  •     తెలంగాణకు కరువు ముప్పు లేదు.. ఆ ముప్పు మాకే ఉంది
  •     శ్రీశైలంలోని ఆవిరి నష్టాల్లో 22 టీఎంసీలు తమకివ్వాలని వాదన
  •     ముగిసిన ఏపీ వాదనలు.. నేటి నుంచి తెలంగాణ వివరణలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల వినియోగంపై బేసిన్‌‌‌‌‌‌‌‌లోని జనాభానే ప్రామాణికంగా తీసుకోవడం కరెక్ట్​ కాదని ఏపీ వాదించింది. కృష్ణా నీళ్లను వాడుకుంటున్న ప్రజలనూ పరిగణనలోకి తీసుకోవాలని, ఔట్ సైడ్ బేసిన్ అయిన పెన్నా బేసిన్‌‌‌‌‌‌‌‌లోనూ కృష్ణా జలాల వినియోగం ఉందని పేర్కొంది. కనుక వినియోగమున్న ప్రాంతాల్లోని జనాభా మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని నీటిని పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని వాదనకు దిగింది. కరువు ముప్పంటూ ఉంటే అది తమ ప్రాంతంలోని రాయలసీమకే ఉందని, తెలంగాణకు లేదంటూ మొండివాదనలకు దిగింది. 

గురువారం ఏపీ తన చివరి వాదనలను కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు వినిపించింది. స్థానికంగా క్రాప్ డేటా అందుబాటులో లేకుంటే.. 1984లో కేంద్రం ఇచ్చిన ఎఫ్ఏవో గైడ్​లైన్స్​లోని అంశాల ప్రకారం క్రాప్​ డేటాను లెక్కలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ లెక్కల ప్రకారం బేసిన్‌‌‌‌‌‌‌‌నే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో కృష్ణా బేసిన్‌‌‌‌‌‌‌‌లో 2 కోట్లు, ఏపీలో 76 లక్షల జనాభా ఉన్నారని పేర్కంది. అంటే తెలంగాణలో 71.9 శాతం, ఏపీలో 28.10 శాతం జనాభా కృష్ణా బేసిన్​లో ఉన్నారని పేర్కొంది.

అయితే, సర్వీసబుల్ ఏరియా (జల వినియోగం ఉన్న ప్రాంతాలు)ను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం తెలంగాణ కన్నా ఏపీలోనే ఎక్కువ జనాభా ఉందని అడ్డమైన వాదనలకు దిగింది. సర్వీసబుల్ ఏరియానూ పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో 2 కోట్లుంటే.. ఏపీలో 2.6 కోట్ల మంది జనాభా ఉన్నారంటూ వాదించింది. ఆ లెక్కన తెలంగాణలో కేవలం 43.42 శాతం, ఏపీలో 56.58 శాతం జనాభా ఉందని వివరించింది. తలసరి వినియోగం కూడా సర్వీసబుల్ ఏరియా పరంగానే తీసుకోవాలని, ఆ లెక్కన ఏపీ తలసరి వినియోగం 556 క్యూబిక్​ మీటర్లని, తెలంగాణ తలసరి వినియోగం 456 క్యూబిక్​ మీటర్లని వాదించింది. కాగా, శ్రీశైలం వద్ద ఉన్న ఆవిరి నష్టాల్లో ఎక్కువ వాటా తమదేనని వాదనకు దిగింది. 33 టీఎంసీల నష్టాలుండగా.. మూడు రీజియన్లకు కలిపి 11 టీఎంసీల చొప్పున పంచారని పేర్కొంది.

ఇప్పుడు తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో.. ఏపీలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు 11 చొప్పున 22 టీఎంసీలు ఇవ్వాలని వాదించింది. అంతేగాకుండా కేడీఎస్ కింద పులిచింతలను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​గా వాడుతున్నామని, కనుక అక్కడి 9 టీఎంసీల ఆవిరి నష్టాలనూ తమకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతేగాకుండా కామన్ రిజర్వాయర్ల కింద మాత్రమే నీటి వాటాలను విభజించాలని, ఎవరి ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల నీళ్లను వాళ్లకే ఇవ్వాలని ఏపీ వాదించింది. కాగా, గురువారంతో ఏపీ వాదనలు ముగిసిపోయాయి. శుక్రవారం నుంచి ఏపీ వాదనలపై తెలంగాణ రిజాయిండర్​ను ఇవ్వనుంది. ఇక, రెండు రాష్ట్రాలను వారి వారి కేసు వివరాలపై 30 నుంచి 40 పేజీలతో ఒక నోట్​ ఇవ్వాల్సిందిగా ట్రిబ్యునల్ ఆదేశించింది.