హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో పిటిషనర్లు హైకోర్టును కోరారు. స్పీకర్ తన ముందున్న ఆధారాలను పూర్తిగా పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, ఆ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జి.జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కె.సంజయ్, పల్లె రాజేశ్వర్ రెడ్డి, సీహెచ్ ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. దానం నాగేందర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి పోటీ చేశారని, దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ ముందుంచినా పరిగణనలోకి తీసుకోలేదని గండ్ర మోహన్ రావు తెలిపారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లతోపాటు ఇతర ఆధారాలను కూడా సమర్పించామన్నారు.
కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన విషయాన్ని ప్రతివాదులు తమ కౌంటర్లలో అంగీకరించారని చెప్పారు. కాంగ్రెస్ కండువా ధరించడం, గాంధీభవన్‌కు వెళ్లడం, అప్పటి పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, సీఎం సమావేశాల్లో పాల్గొనడం వంటి అంశాలకు ఆధారాలున్నాయని వివరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉన్నారని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చేసిన ప్రకటనలను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీలో జరిగిన అంశాలకే పరిమితమై బయట జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులకు విరుద్ధంగా స్పీకర్ ఉత్తర్వులు ఉన్నాయని, అనర్హత పిటిషన్లను తిరస్కరించడానికి చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
