క్యూర్ వీధుల్లో సౌర వెలుగులు..3 గ్రేటర్ కార్పొరేషన్ల పరిధిలో 7.60 లక్షల సోలార్ లైట్ల ఏర్పాటుకు కసరత్తు

క్యూర్ వీధుల్లో సౌర వెలుగులు..3 గ్రేటర్ కార్పొరేషన్ల పరిధిలో 7.60 లక్షల సోలార్ లైట్ల ఏర్పాటుకు కసరత్తు
  •     రూ.2 వేల కోట్లతో ప్రతిపాదనలు
  •     పైలట్‌‌‌‌ ప్రాజెక్టు కింద సైబరాబాద్‌‌‌‌లో ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ మెగా సిటీలో సోలార్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌ లైట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రీన్‌‌‌‌ ఎనర్జీని ప్రోత్సహించడంతో పాటు ప్రతి నెలా చెల్లించే విద్యుత్‌‌‌‌ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. కోర్‌‌‌‌ అర్బన్‌‌‌‌ రీజియన్‌‌‌‌(క్యూర్‌‌‌‌) పరిధిలోని మూడు గ్రేటర్‌‌‌‌ కార్పొరేషన్లలో దశలవారీగా మొత్తం 7.60 లక్షల సోలార్‌‌‌‌ లైట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికి అవసరమైన నిధులపై అంచనాలు రూపొందించే బాధ్యతను టీజీ రెడ్కో, క్యూర్‌‌‌‌ అధికారులకు అప్పగించింది. ముందుగా సైబరాబాద్‌‌‌‌ గ్రేటర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో పైలట్‌‌‌‌ ప్రాజెక్టు చేపట్టి, విజయవంతమైతే క్యూర్‌‌‌‌ పరిధి అంతటా అమలు చేయాలని నిర్ణయించింది.

పదేండ్లపాటు నిర్వహణకు టెండర్లు..

క్యూర్‌‌‌‌ పరిధిలోని 3 గ్రేటర్‌‌‌‌ కార్పొరేషన్లలో మొత్తం 7.60 లక్షల వీధిలైట్లు అవసరం ఉన్నాయి. జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో 3.30 లక్షలు, సైబరాబాద్‌‌‌‌లో 1.85 లక్షలు, మల్కాజ్‌‌‌‌గిరిలో 2.45 లక్షల లైట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 5.60 లక్షల ఎల్‌‌‌‌ఈడీ వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు లోపల ఇటీవల విలీనమైన ప్రాంతాల్లో మరో 2 లక్షల స్ట్రీట్‌‌‌‌ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాగా, నగరంలో ఎల్‌‌‌‌ఈడీ స్ట్రీట్‌‌‌‌ లైట్ల ఏర్పాటు, నిర్వహణను పదేండ్లపాటు చేపట్టేందుకు జీహెచ్‌‌‌‌ఎంసీ రూ.1,341.6 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లు పిలిచింది. ఇవి ఇంకా ఖరారు కాలేదు.

కరెంట్‌‌‌‌ బిల్లుల భారం తగ్గించేందుకు..

క్యూర్‌‌‌‌ పరిధిలోని స్ట్రీట్‌‌‌‌ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు పదేండ్లలో రూ.1,340 కోట్లు ఖర్చవుతుండగా, విద్యుత్‌‌‌‌ బిల్లుల కోసం నెలకు రూ.15 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఈ లెక్కన రాబోయే పదేండ్లలో విద్యుత్‌‌‌‌ బిల్లుల భారం రూ.1,500 కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ భారం తగ్గించేందుకు సోలార్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌ లైట్లు ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశాలతో క్యూర్‌‌‌‌ అధికారులు తిరువనంతపురం, సాంచి, అయోధ్య నగరాల్లో అమలు చేస్తున్న సోలార్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌ లైట్ల విధానాన్ని ఇప్పటికే పరిశీలించారు. హైదరాబాద్‌‌‌‌లో దశలవారీగా ప్రాజెక్టును అమలు చేసేందుకు సుమారు రూ.2 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం 
చేస్తున్నట్లు తెలిసింది.

మూడ్రోజులు ఎండ లేకున్నా వెలిగే సోలార్‌‌‌‌‌‌‌‌ లైట్లు..

సైబరాబాద్‌‌‌‌ గ్రేటర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో 200 ప్రాంతాల్లో పైలట్‌‌‌‌ ప్రాజెక్టుగా సోలార్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌ లైట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోల్స్‌‌‌‌, సోలార్‌‌‌‌ ప్యానెళ్లు, లైట్ల ఏర్పాటుకు రూ.1.43 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మూడు రోజులపాటు ఎండ లేకపోయినా రాత్రివేళ లైట్లు వెలిగే సాంకేతికతను వినియోగించనున్నారు. మొబైల్‌‌‌‌ ఫోన్ల ద్వారా లైట్ల పనితీరును పర్యవేక్షించే సదుపాయం కూడా ఉంటుంది. పైలట్‌‌‌‌ ప్రాజెక్టు విజయవంతమైతే నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని క్యూర్‌‌‌‌ అధికారి ఒకరు తెలిపారు. ఒక్కో యూనిట్‌‌‌‌లో 9,800 ల్యూమెన్లకు పైగా వెలుతురు ఇచ్చే 70 వాట్ల ఎల్‌‌‌‌ఈడీ లూమినేర్‌‌‌‌ ఉండనుంది. సోలార్‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌కు 25 ఏండ్ల వారంటీ ఉంటుందని అధికారులు తెలిపారు.