రాయగడ్: మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. టూరిస్ట్ ప్లేస్ అయిన దివేగర్ బీచ్‌లో ఎనిమిది మంది టీనేజర్స్ గల్లంతయిన ఘటన విషాదం నింపింది. పూణేకు చెందిన ఎనిమిది మంది టీనేజ్ విద్యార్థులు సముద్ర ప్రవాహంలో చిక్కుకుని మునిగిపోయారు. మృతులందరూ 16 ఏళ్ల వయస్సు వారేనని, వారి మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.
వీళ్లంతా పూణే జిల్లాలోని అలందిలో ఉన్న 'విన్నర్స్ అకాడమీ' అనే ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థులు కావడం గమనార్హం. కోచింగ్ సెంటర్ స్టాఫ్, స్టూడెంట్స్ కలిసి దాదాపు 170 కిలోమీటర్లు ప్రయాణించి ఈ పర్యాటక ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లారు.
గురువారం సాయంత్రం 5:30 గంటల సమయంలో 25 మంది అబ్బాయిలు, 17 మంది అమ్మాయిలు, ఆరుగురు ఉపాధ్యాయులతో సహా 48 మంది బీచ్‌కు పిక్నిక్‌కు వెళ్లారు. నీటి లోతు, ప్రవాహాన్ని తప్పుగా అంచనా వేసి లోతుకు వెళ్లారు. ఈ క్రమంలోనే.. ఎనిమిది మంది విద్యార్థులను సముద్రం మింగేసింది. అలలు ఎనిమిది మంది విద్యార్థుల ప్రాణాలను హరించేశాయి. విహార యాత్ర ఇలా విషాద యాత్రగా మారడంతో తోటి విద్యార్థులు, కోచింగ్ సెంటర్ స్టాఫ్ శోక సంద్రంలో మునిగిపోయారు.
దివేగర్‌లోని 'భౌ మారుతి సలుంఖే మహాకాళి వాటర్ స్పోర్ట్స్' యజమాని భౌ సలుంఖే.. తన రెస్క్యూ టీంను రంగంలోకి దింపారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఆ వాటర్ స్పోర్ట్స్ బృందం సముద్రంలో నుంచి ఎనిమిది మంది బాధితుల మృతదేహాలను వెలికి తీసింది.
ఈ విషాదం గురించి సమాచారం అందిన వెంటనే, దిఘి సాగరి బోర్లి పంచాతన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఏపీఐ) సంతోష్ అవతి ఒక బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక గ్రామస్థుల సహాయంతో, పోలీసులు మృతదేహాలను తమ ఆధీనంలోకి తీసుకుని, పోస్ట్‌మార్టం పరీక్షలు మరియు అవసరమైన చట్టపరమైన ప్రక్రియల కోసం బోర్లి పంచాతన్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) పంపించారు.
చనిపోయిన విద్యార్థులను.. యశ్ కిరణ్ వాంఖడే, సోహం తుకారాం భండ్వాల్కర్, కౌస్తుభ్ సందీప్ దౌండ్, తన్మయ్ దత్తాత్రయ్ వహిలే, సుమిత్ భరత్ అహిరే, ప్రణవ్ రాందాస్ బన్సోడే, కైవల్య సతీష్ వసంత్, రాజ్‌వీర్ యువరాజ్ వాహిలేలుగా గుర్తించారు.
